Begin typing your search above and press return to search.

బాహుబ‌లిని మించిన క‌ర్ణాట‌క ఘ‌ట్టం

By:  Tupaki Desk   |   25 May 2018 1:17 PM GMT
బాహుబ‌లిని మించిన క‌ర్ణాట‌క ఘ‌ట్టం
X
క్ష‌ణ‌క్ష‌ణం... ఉత్కంఠ‌. ఎన్నిక జ‌రిగే వ‌ర‌కు ఒక ద‌శ‌. ఫ‌లితాల త‌ర్వాత కూట‌మి ద‌శ‌. ఆ త‌ర్వాత బేర‌సారాల ద‌శ‌. చివ‌ర‌కు కూట‌మికి అధికారం... అక్క‌డితో అయిపోయిందా అంటే అదీ లేదు. మ‌ళ్లీ కొత్త ఉత్కంఠ‌. స్పీక‌ర్ ఎన్నిక చివ‌రి నిమిషం వ‌ర‌కు. బ‌హుశా క‌ర్ణాట‌క సీఎం పీఠ‌మెక్క‌డం బాహుబ‌లి-1 - 2 ల కంటే మించిన ఆస‌క్తిని ఉత్కంఠ‌ను రేపింది. చివ‌ర‌కు కుమార‌స్వామి పీఠంపై కూర్చున్నారు. అసంతృప్తి సెగ‌లు, పొగలు ఉన్నా వాట‌న్నింటినీ దాటుకుని ఆయ‌న క‌ర్ణాట‌క సీఎం అనిపించుకున్నారు.

అయితే, హెచ్.డి. కుమారస్వామి శాసన సభలో బలపరీక్షకు ముందే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్రతిపక్షం వాకౌట్ చెయ్యడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతానికి గట్టెక్కింది. బ‌ల‌నిరూప‌ణంగా సాఫీగా సాగింది. ఇంత‌కాలం ఎక్క‌డ జారిపోతారో అని పార్టీ బంధ‌నంలో ఉంచిన ఎమ్మెల్యేల‌కు విడుద‌ల జ‌రిగింది. ఎమ్మెల్యేలు ఇంటి బాట‌ప‌ట్టారు.

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో బీజేపీ ఇచ్చిన ట్విస్టుల కంటే కాంగ్రెస్ ఫీల‌ర్లు ఎక్కువ ఆస‌క్తిని క‌లిగించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న 30 నెల‌ల సీఎం అని, డిప్యూటీ స్పీక‌ర్ త‌ప్పుకున్నార‌ని - కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ఉంద‌ని.... ఇలా సాగింది ఉత్కంఠ‌. ఇదంతా ఒకెత్తు అయితే గెల‌వ‌క‌పోయినా చేతికి సీఎం కుర్చీ వ‌స్తే హాయిగా కూర్చోక కుమార‌స్వామి విచిత్ర‌మైన ఆవేద‌న వెలిబుచ్చారు. నేను ఇలా సీఎం కావాల‌నుకోలేద‌ని, ప్ర‌జ‌లు మెజారిటీతో గెలిపిస్తార‌ని అనుకున్నారని ఆయ‌న బాధ‌ప‌డ్డారట‌. అంద‌రూ కుమార‌స్వామిది ఏం ల‌క్కురా అనుకుంటుంటే... నేనే మోస్ట్ అన్ ల‌క్కీఅని ఆయ‌న ఫీల‌వుతున్నార‌ట‌. ఈయ‌నెవ‌ర్రా బాబూ అంద‌రూ అవాక్క‌య్యే ప‌రిస్థితి.

అసెంబ్లీ విశేషాలు...

* శుక్రవారం 12.15 గంటల సమయానికి కర్ణాటక శాసన సభ ప్రారంభం అయ్యింది.

* కర్ణాటక స్పీకర్ గా శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్. రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

* స్పీకర్ ఎన్నిక పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బలపరీక్షకు సిద్దమని, తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారు.

* అంత‌కుముందు అది తండ్రి - కొడుకుల పార్టీ అని ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు.

* కుళ్లు రాజకీయాలు చెయ్యడంలో వీళ్లు ముందు వరసలో ఉంటారని, అధికారం కోసం ఏమైనా చేస్తారని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. దీంతో వారు యడ్యూరప్పతో వాగ్వివాదానికి దిగారు.

* దీంతో బ‌ల‌ప‌రీక్ష‌ను బైకాట్ చేస్తూ బీఎస్. యడ్యూరప్పతో సహా 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

* అనంత‌రం జేడీఎస్ - కాంగ్రెస్ - ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నామని చెప్ప‌డంతో బ‌ల‌ప‌రీక్ష పూర్త‌య్యింది.