Begin typing your search above and press return to search.

మాల్యాకు నో చెప్పి బ‌తికిపోయిన బ్యాంకు క‌థ ఇది!

By:  Tupaki Desk   |   11 July 2019 7:48 AM GMT
మాల్యాకు నో చెప్పి బ‌తికిపోయిన బ్యాంకు క‌థ ఇది!
X
ఇప్పుడంటే మాల్యా గురించి తెలుసు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఇంకాస్త క‌చ్ఛితంగా చెప్పాలంటే ఇబ్బ‌డిముబ్బ‌డిగా అప్పులు చేసి.. దేశం విడిచి పారిపోవ‌టానికి ముందు వ‌ర‌కు ఆయ‌న అప్పు అడిగితే నో చెప్పే ద‌మ్ము ధైర్యం చాలా బ్యాంకుల‌కు ఉండేది కాదు. ఆయ‌న స్వ‌యంగా ఫోన్ చేసి.. అప్పు గురించి అడిగితే.. ఓకే సార్ అన‌ట‌మే కానీ నో చెప్పినోళ్లు దాదాపుగా ఉండ‌రు. అయితే.. మాల్యా ప్ర‌పోజ‌ల్ కు నో చెప్పి.. ఆయ‌న చేత తిట్టు తిన్న‌ప్ప‌టికీ అప్పు ఇవ్వ‌ని బ్యాంకు క‌థ ఇప్పుడు మీకు చెప్ప‌బోతున్నాం.

నిజానికి ఈ విష‌యాన్ని స‌ద‌రు బ్యాంక్ ఎండీ క‌మ్ సీఈవోనే ఆ విష‌యాన్ని రివీల్ చేశారు. అదెలానంటే..ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు త‌మ‌ల్ బంధోపాధ్యాయ ఒక పుస్త‌కాన్ని రాశారు. ఆ కార్య‌క్ర‌మానికి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఎండీ క‌మ్ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నా ప్ర‌ముఖ బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జం ఆదిత్య పురి. అలాంటి ఆయ‌న మాల్యా నుంచి త‌మ బ్యాంకు త‌ప్పించుకున్న ముప్పుగురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

ఆయ‌న మాట‌ల్లోనే ఆ అనుభ‌వం గురించి చెప్పుకొస్తే..

మీరు ఎవ‌రితోనైనా క‌లిసి కాఫీ తాగండి. కానీ.. మ‌నం ఏది అనుకుంటామో అదే చేయాలి. వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల్ని వృత్తిలోకి తీసుకురాకూడ‌దు. నా చిర‌కాల కొలీగ్ ప‌రేష్ సుక్తాంక‌ర్ ఇదే సూత్రాన్ని పాటించాడు. పెద్ద ముప్పు నుంచి త‌ప్పించుకున్నాడు. మీరు రిస్క్ గా మారితే.. మీకు అప్పు ఇవ్వ‌టం నాకు కూడా రిస్కే.

మీరు నాకు మంచి స్నేహితుడైతే పిలిచి కాఫీ ఇచ్చి పంపిస్తా. అంతేకానీ.. ప‌ని చేసే బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించ‌లేం క‌దా? కొన్నేళ్ల క్రితం అప్పు కోసం మాల్యా సిబ్బంది నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఆ అప్లికేష‌న్ చూస్తాన‌ని చెప్పి వారికి కాఫీ ఇచ్చి పంపాం. ఆ త‌ర్వాత ఆ అప్లికేష‌న్ ను చూడాల‌ని నా కొలీగ్ ప‌రేష్ కు ఇచ్చాను. ఆయ‌నకు మాల్యా విష‌యం అర్థ‌మై.. విష‌యం చెప్పారు. ఆ తర్వాత‌ ఆ అప్లికేష‌న్ ను నిర్మోహ‌మాటంగా రిజెక్ట్ చేశాం. త‌ర్వాత మాల్యా ఫోన్ చేసిన ప్ర‌తిసారీ ఆవేశంగా మాట్లాడేవారు.

స్నేహం.. బ్యాంకింగ్ రెండు క‌త్తులూ ఒకే ఒర‌లో ఇమ‌డ‌వు. స్నేహాన్ని స్నేహంగా చూడాలే కానీ.. బ్యాంకింగ్ వ్య‌వ‌హారాల్లోకి తీసుకొస్తే ఇబ్బందేన‌ని చెప్పారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రుణాలు మంజూరు చేసే విష‌యంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అనుస‌రించే విధానాల కార‌ణంగా ఈ బ్యాంకుకు అతి త‌క్కువ రాని బాకీలు ఉన్నాయి. ప‌నికి త‌గ్గ‌ట్లే ఫ‌లితం వ‌స్తుంది క‌దా?