Begin typing your search above and press return to search.

ఒక మంచి భర్త సూసైడ్ లేఖ ఇలా ఉంటుందా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 1:30 AM GMT
ఒక మంచి భర్త సూసైడ్ లేఖ ఇలా ఉంటుందా?
X
హైదరాబాద్ కేంద్రంగా ఓ ప్రైవేట్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం సందర్భంగా అతడు రాసుకున్న సూసైడ్ నోట్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనో - లేదంటే... తన కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను పరిష్కరించాలనో ఆత్మహత్యాయత్నానికి పాల్పడే వారు తమ సూసైడ్ నోట్ లో పేర్కొంటారు. ఈ బ్యాంకు అధికారి కూడా తన సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాడు. అదేంటంటే... తాను చనిపోయాక తన భార్యకు ఇంకో పెళ్లి చేయాలని కోరడమే. కాస్తంత తరచి చూస్తే... ఇలాంటి కోరికలు ఆసక్తి రేకెత్తించినా... తన జీవిత సహచరిని ఒంటరిగా విడిచివెళ్లకుండా మరో తోడు అందించినట్లుగా కనిపించినా... ఈ తరహా కోరిక అరుదేనని చెప్పాలి.

ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఖమ్మంకు చెందిన చిత్తలూరు శ్రవణ్ కుమార్... హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ హెడ్ డీఎఫ్ సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన హరితను వివాహం చేసుకున్న శ్రవణ్... జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో కాపురం పెట్టారు. ఏ తరహా ఇబ్బందులు వచ్చాయో తెలియదు గానీ... శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే మద్యంలో విషం కలపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తలుపులు కొడుతూ కేకలు వేశాడు. ఇదేదో దొంగల పని అని భావించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శ్రవణ్ ఇంటికి చేరుకుని అతడి పరిస్థితిని గమనించి హుటాహుటీన ఆసుపత్రికి తలించారు.

అదే సమయంలో ఇంటిలో శ్రవణ్ రాసుకున్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని చూసి షాక్ తిన్నారు. తన సూసైడ్ నోట్ లో శ్రవణ్ ఏం రాసుకున్నాడన్న విషయానికి వస్తే... ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చనిపోతున్నాను. నా భార్య హరిత చాలా మంచిది. ఆమెకు మళ్లీ పెళ్లి చేయండి. మా నాన్నను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి’’ అని రాసుకున్నాడు. అంతేకాకుండా మరొకరు తనకు ఇవ్వాల్సిన డబ్బుతో తన కర్మకాండలు నిర్వహించాలని కూడా శ్రవణ్ రాసుకున్నాడు. మొత్తంగా ఎన్ని విషయాలు ప్రస్తావించినా... ఏడాది క్రితం తనను పెళ్లి చేసుకున్న తన భార్య.. తన మరణంతో ఒంటరిగా మిగిలిపోరాదని, వెంటనే ఆమెకు పెళ్లి చేయాలని శ్రవణ్ కోరడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. అయితే ప్రస్తుతం శ్రవణ్ ఆత్మహత్యాయత్నంలో భాగంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోగా... వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.