Begin typing your search above and press return to search.

అసలే మాజీ మంత్రి గారు.. అంత మాట అనేస్తారా...?

By:  Tupaki Desk   |   6 May 2022 10:05 AM GMT
అసలే మాజీ మంత్రి గారు.. అంత మాట అనేస్తారా...?
X
మూలిగే నక్క మీద తాటిపండు అనే ఒక సామెత ఉంది. దాని అర్ధం ఏంటంటే సకల సమస్యలతో సతమతం అవుతున్న వారి నెత్తిన పిడుగు పడితే ఎలా ఉంటుందో అలా అని. ఇపుడు అలాంటి సమస్యలు ఎవరికి ఉన్నాయి అంటే చెప్పుకుంటే అందరికీ ఉంటాయి. ఇక పదవి పోయిన వారికి ఉన్న బాధలు చెప్పనలవి కానే కాదు కదా.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడేళ్ళ పాటు ఏకైక మంత్రిగా అలరించిన అవంతి శ్రీనివాసరావుని విస్తరణ నేపధ్యంలో తప్పించేశారు. ఆయన అలకపానుపు ఎక్కారు కూడా. మొత్తానికి ఆయన్ని తెచ్చి వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ చేశారు. త్వరలో జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ ని కూడా చేస్తామని అధినాయకత్వం ప్రామిస్ చేసింది.

దాంతో లోలోపల మనసు మధనపడుతున్నా ఇపుడిపుడే ఆయన గొంతు పెంచి టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు సిక్కోలు సభ ఇచ్చిన కిక్ తో విశాఖ జిల్లాకు వచ్చి ఏకంగా మాజీ మంత్రి అవంతి ఇలాకా భీమిలీనే బాదుడు ప్రోగ్రాం కి ఎంచుకున్నారు.

అక్కడ బాబు మాటల ప్రవాహం వరద గోదావరినే తలపించింది. ఆయన వైసీపీ మీద చేసిన కామెంట్స్ లో దూకుడు చూసి తమ్ముళ్ళే హుషారెత్తారు. ఇలాంటి కీలక సమయాన మనసులో ఉన్న మాటను కూడా అనేశారు బాబు గారు. విశాఖకు రాజధాని వద్దు అభివృద్ధి చాలు అని. దాని మీద కౌంటరేశారు మాజీ మంత్రి అవంతి సార్. విశాఖ రాజధాని వద్దంటారా, ప్రజలు వద్దు అని అన్నారని ఎవరు చెప్పారు మీకు.

దమ్ముంటే ముందు మీ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి, అపుడు సత్తా తెలుస్తుంది అని పెను సవాల్ విసిరారు అవంతి. అంటే విశాఖలోని నార్త్, ఈస్ట్, వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాను అవంతి కోరారు అన్న మాట. నిజానికి ఈ సవాల్ కి జవాబుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నిజమైన షాక్ ఎవరితో అపుడు తెలుస్తుంది. ఎందుకంటే విభజన తరువాత చిన్నదైన విశాఖ జిల్లాలో టీడీపీదే పొలిటికల్ డామినేషన్.

సరే ఆ సంగతి అలా ఉంచితే అవంతి సవాల్ కి సరైన జవాబు మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చెప్పారు. విశాఖ రాజధాని ప్రకటన తరువాత వైసీపీ ఒక్క రూపాయి అయినా ఈ ప్రాంతానికి కేటాయించిందా అవంతి గారూ అంటూ డైరెక్ట్ గానే అడిగేశారు. అంతే కాదు విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ రాజధాని పేరిట మాటలు చెబుతోందని కూడా కస్సుమన్నారు.

అంతటితో ఊరుకుంటే ఓకే. కానీ అక్కడ ఉన్నది అయ్యన్న కదా. విశాఖ రాజధాని అని వైసీపీ చేసిన ప్రకటన తరువాత అవంతి రాసలీలల ఆడియో తప్ప ఒక్క పైసా అయినా బయటకు వచ్చిందా అని మాజీ మంత్రి గారిని ఎక్కడో గుచ్చేశారు. ఇపుడు పదవి పోయాకా ఉత్తరాంధ్రా అవంతికి గుర్తుకు వచ్చిందా అంటూ అని నిలదీశారు కూడా. మొత్తానికి అవంతి మాజీ అయ్యాను అన్న బాధతో ఉంటే ఈ రాసలీలల ఆడియో గురించి అయ్యన్న కెలకడంతో నిజంగా ఆయన బాధ వర్ణనాతీతమే అంటున్నారు తమ్ముళ్ళు.