Begin typing your search above and press return to search.

ఉత్త‌రాఖండ్ కొత్త ముఖ్య‌మంత్రి ఆయ‌నే..

By:  Tupaki Desk   |   3 July 2021 4:44 PM GMT
ఉత్త‌రాఖండ్ కొత్త ముఖ్య‌మంత్రి ఆయ‌నే..
X
వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ మినీ సంగ్రామంలో గెల‌వ‌డం ద్వారా ప‌ట్టు నిల‌బెట్టుకోవాల‌ని బీజేపీ ఆరాట‌ప‌డుతోంది. ఇటీవ‌ల ప‌ట్టుజారుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తుండ‌డంతో.. చ‌క్క‌దిద్దే ప‌నులు వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రివ‌ర్గంలో కీల‌క మార్పులు చేయ‌బోతోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దాంతోపాటు రాష్ట్రాల్లోనూ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

2022లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్త‌రాఖండ్ కూడా ఉంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రిని మార్చ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సీఎం తీర‌త్ సింగ్ శుక్ర‌వార‌మే రాజీనామా చేశారు. ఆయ‌న స్థానంలో కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నుకున్నారు. అన్ని అంశాల‌నూ ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న అధిష్టానం.. నూత‌న సీఎంగా పుష్క‌ర్ సింగ్ ధామిని సెల‌క్ట్ చేసింది.

శ‌నివారం సాయ‌త్రం స‌మావేశ‌మైన బీజేపీ శాస‌న‌స‌భాప‌క్షం.. ధామిని శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నుకుంది. పార్టీ కేంద్ర ప‌రిశీల‌కుడు న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌, రాష్ట్ర ఇన్ ఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌత‌మ్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అస‌మ్మ‌తి రాకుండా ముంద‌స్తుగా తోమ‌ర్‌.. కీల‌క నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు.

వాస్త‌వానికి సీఎం సీటుకోసం స‌త్పాల్ మ‌హ‌రాజ్‌, ధ‌న్ సింగ్ రావ‌త్ సీఎం రేసులో ఉన్నారు. ఎవ‌రికి వారు ముఖ్య‌మంత్రి సీటు ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే.. అన్ని అంశాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న అధిష్టానం.. పుష్క‌ర్ సింగ్ ధామికే ఓటు వేసింది. దీంతో.. ఆయ‌న్ను ఏకగ్రీవంగా సీఎల్పీ నేత‌గా ఎన్నుకున్నారు.

అయితే.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి తీర‌త్ సింగ్ ఈ ఏడాది మార్చిలోనే బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మార్చి 10వ తేదీన తీర‌త్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. అయితే.. ఆయ‌న ఎమ్మెల్యే కాదు. రాజ్యాంగ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. సాధార‌ణ పౌరుడు ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి కావొచ్చు. మంత్రి కూడా కావొచ్చు. కానీ.. ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి 6 నెల‌ల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి శాస‌న స‌భ్యుడు కావాలి. లేదంటే.. ఎమ్మెల్సీ అయినా కావాలి.

కానీ.. తోమ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌జాప్ర‌తినిధీ కాలేక‌పోయారు. సెప్టెంబ‌ర్ 5 లోగా ఆయ‌న గ‌డువు ముగుస్తుంది. ఆ త‌ర్వాత మ‌రో ఆరు నెల‌ల్లో రాష్ట్రంలో ఎన్నికల్లో జ‌ర‌గ‌బోతున్నాయి. ఆర్నెల్ల‌లోపు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం కుద‌ర‌దు. ఈ కార‌ణంగానే.. ఆయ‌న రాజీనామా చేశార‌ని చెబుతున్నారు. కానీ.. అధిష్టానం త‌లుచుకుంటే.. ఇది పెద్ద విష‌య‌మే కాదని, ఇత‌ర కార‌ణాల‌తోనే సీఎంను త‌ప్పించి ఉండొచ్చ‌నే చ‌ర్చ సాగుతోంది.