Begin typing your search above and press return to search.

అయ్యో పాపం: కష్టం చెదల పాలు.. గుండె ఆపరేషన్ కోసం కూడబెడితే!

By:  Tupaki Desk   |   3 Nov 2021 2:30 AM GMT
అయ్యో పాపం: కష్టం చెదల పాలు.. గుండె ఆపరేషన్ కోసం కూడబెడితే!
X
విధి ఆడే వింత నాటకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోజు మనం సంపాదించుకున్న సొమ్ము కూడా రేపు మనకు అక్కరకు రాకుండా పోతుందంటే తట్టుకోలేం. పైగా ఆస్పత్రి కోసం పైసా పైసా పోగుచేసుకున్న డబ్బు ఒక్కసారిగా ముక్కలుగా కనిపిస్తే... వారి గుండె నిజంగానే ముక్కలవుతుంది కదా. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ వృద్ధుడికి గుండె సమస్య ఉంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో డబ్బును పోగు చేసే పనిలో పడ్డారు. చేతికి వచ్చిన కొంత డబ్బును బీరువాలో పెట్టి మిగతా డబ్బులను సమీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఓ ఊహించని సంఘటన ఆయన ఆశలను ఆవిరి చేసింది. గుండెకు ఆపరేషన్ అవడమేమో కానీ నిజంగా గుండె ముక్కలయ్యేలా చేసింది.

ఎలాగైనా సరే గుండె ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ వృద్ధుడు. అందుకు పైసా పైసా సమకూరుస్తున్నారు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని భావించారు. అందుకే రూ.లక్షల ఖరీదైన చికిత్స చేయించుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకు కావాల్సిన డబ్బును సమీకరించే పనిలో పడ్డారు. తన కష్టంతో కూడబెట్టిన సొమ్మును అంతా జాగ్రత్తగా బీరువాలో భద్రపరిచారు. కానీ మనం ఒకటి అనుకుంటే కాలం ఇంకోటి చేస్తుంది కదా. సరిగ్గా ఈ వృద్ధుడికి సైతం అలాగే జరిగింది. ఆపరేషన్ కోసం దాచిన డబ్బు అంతా కూడా చెదల పాలైంది.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వాకాటికి చెందిన షేక్ మహబూబ్ బాషాకి గుండె సమస్య ఉంది. గుండెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని చెప్పారు. అప్పటినుంచి పైసాపైసా కూడబెడుతున్నారు ఈ వృద్ధుడు. పైగా ఇంట్లో ఉన్నా పాడి గేదెలను సైతం విక్రయించారు. ఆ డబ్బునంతా బీరువాలో దాచి పెట్టారు. మిగతా డబ్బులను సమకూర్చే పనిలో పడ్డారు. ఆ డబ్బు సమకూరింది. ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.లక్ష తీశారు. ఆ డబ్బును చూసిన ఆయన షాక్ అయ్యారు. బీరువాలో భద్రంగా ఉంచిన డబ్బును కాస్త చెదలు తినేశాయి.

రెక్కలుముక్కలు చేసుకొని కూడబెట్టిన డబ్బు. పైసాపైసా పోగుచేసి దాచుకున్న డబ్బు అంతా కూడా చెదల పాలు కావడంతో ఆ షేక్ మహబూబ్ లబోదిబోమన్నారు. ఆస్పత్రి చికిత్స కోసం దాచుకున్న డబ్బు అంతా ఇలా ముక్కలు ముక్కలు కావడాన్ని తట్టుకోలేకపోయారు. చినిగిన నోట్లను ముందు పెట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చారు. చెదల పాలైన ఆ డబ్బులో రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఉన్నాయి. చికిత్స కోసం ఎంతో జాగ్రత్తగా కూడబెట్టిన సొమ్ము ఇలా ముక్కలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రభుత్వం తనని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుండె ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు కాస్త చెదల పాలయ్యాయని కంటతడి పెట్టుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పలుచోట్ల కూడా జరగడం గమనార్హం. ఓ వ్యాపారి కరెన్సీ నోట్లను ట్రంకు బాక్సులో భద్రపరిచారు. కొన్ని రోజుల తర్వాత దానిని తెరవగా రూ.లక్షల్లోని డబ్బు చెదలపాలైంది.