Begin typing your search above and press return to search.

రూ.70 లక్షలు ఇస్తానన్న ఆ గొర్రెను ఇవ్వటానికి నో చెబుతున్నాడు

By:  Tupaki Desk   |   13 Dec 2020 2:30 PM GMT
రూ.70 లక్షలు ఇస్తానన్న ఆ గొర్రెను ఇవ్వటానికి నో చెబుతున్నాడు
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం. నమ్మకం కలగటం లేదు కదా? సాధారణంగా రూ.5 నుంచి రూ.10 వేల మధ్యలో ఉండే గొర్రెను.. ఏ పిచ్చాడు రూ.70లక్షలు ఆఫర్ చేస్తాడని అంటారా? అక్కడికే వస్తున్నాం. తొందరపడి మాట అనేయకండి. ఎందుకంటే.. తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒక వ్యక్తి వద్ద మాడ్గాల్ జాతి గొర్రెలు ఉన్నాయి. అయితే.. అతడు అల్లారు ముద్దుగా ఒక గొర్రెను పెంచుకుంటూ ఉంటాడు. దాని పేరు షార్జా. కానీ.. ఆ మధ్యన అతడు దానికి మోడీ పేరును పెట్టేసుకున్నారు.

ఆ గొర్రె జాతి గురించి తెలిసిన ఒక వ్యక్తి.. సదరు గొర్రెను తనకు ఇస్తే రూ.70లక్షలు ఇస్తానని చెప్పటంతో ఈ వ్యవహారం వార్తాంశంగా మారింది. అంత భారీ మొత్తాన్ని ఇస్తానని చెప్పినా.. ఆ రైతు మాత్రం నో అంటే నో చెప్పేశాడు. తన దగ్గర ఇంకా ఆ జాతి గొర్రెలు 200 వరకు ఉన్నట్లు చెప్పాడు. తనకు మోడీ గొర్రెను అమ్మటం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. సదరు గొర్రె తన కుటుంబానికి లక్కీ అని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మే ప్రసక్తే లేదన్నాడు. అయితే.. ఆ గొర్రెను సొంతం చేసుకోవాలనుకున్న వ్యక్తి.. దానికి రూ.75 లక్షల రేటు పెట్టేశాడు. అయినా నో అని చెప్పాడు.

దీన్ని కొనుగోలుచేయటం కోసం పెద్ద ఎత్తున ఆఫర్లు రావటంతో.. విసిగిపోయిన ఆ వ్యక్తి.. ఆ గొర్రెకు రూ.1.5కోట్లు ఇస్తే తప్పించి ఇవ్వనని తేల్చేశాడు. దీంతో.. ఈ విషయం విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. అమ్మనని చెబుతూ రూ.1.5కోట్లకు అమ్ముతానని ఎందుకు చెబుతున్నట్లు? అని ప్రశ్నిస్తే.. అతగాడి సమాధానం కాస్త భిన్నంగా ఉంది. ‘ఒక గొర్రెకు రూ.కోటిన్నర పెట్టే సాహసం చేయరని.. అందుకే అంత ధర పెట్టినట్లుగా చెబుతున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి.