Begin typing your search above and press return to search.

తిరుపతి మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్లున్నాడే!

By:  Tupaki Desk   |   17 Jan 2021 8:30 AM GMT
తిరుపతి మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్లున్నాడే!
X
తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక మీద చంద్రబాబునాయుడు బాగా నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాటకు ముందొకసారి వెనకోసారి తిరుపతి ఉపఎన్నికలో ప్రజలు వైసీపీ అరచకాలకు బుద్ది చెప్పాలంటూ మాట్లాడుతున్నారు. తాజాగా మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గాలకు, అరాచకాలకు అడ్డుకట్టవేయటానికి ప్రజలకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక మంచి అవకాశమంటూ పిలుపునిచ్చారు. వైసీపీ ఓటమికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికే చారిత్రాత్మక వేదికవ్వాలంటు చెప్పారు.

అంటే చంద్రబాబు మాటలను బట్టిచూస్తే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధికి ఓటమి తప్పదన్నట్లుగానే ఉంది. కానీ సీన్ రివర్సయితే అప్పుడు చంద్రబాబు ఏమి చేస్తారు ? నిజానికి ఉపఎన్నికలో పోటీ చేయటం టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి ఏమాత్రం ఇష్టంలేదని తెలుస్తోంది. ఎందుకంటే గెలుపు అవకాశాలు ఏమాత్రం లేని ఉపఎన్నికలో పోటీ చేయటం పనబాకకు ఇష్టంలేదు. అయితే తనతో సంప్రదించకుండా తన క్యాండిడేచర్ ను చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించేశారు.

ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపి పోటికి ఆమెను ఒప్పించారు. జనవరి 6వ తేదీన తన కూతురు వివాహం అయిపోయిన తర్వాత నేరుగా ప్రచారంలోకి దిగుతానని చెప్పిన పనబాక ఇంతవరకు ఆపని చేయలేదు. అంటే పోటీ విషయంలో ఆమె ఇంకా మానసికంగా ప్రిపేర్ కాలేదని అర్ధమైపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో టీడీపీ అభ్యర్ధి గెలిచిపోతుందని ఎవరు అనుకోవటం లేదు. మరి పనబాక గెలుపుపై చంద్రబాబుకున్న నమ్మకం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు.

మరి క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలుసుకోకుండానే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓటమి చారిత్రాత్మక తీర్పు కావాలని ఎలా కోరుతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు 2.8 లక్షల మెజారిటి వచ్చింది. ఆ మెజారిటిని మరింతగా పెంచుకుంటామని మంత్రులు చెబుతున్నారు. మెజారిటి పెరిగేందుకు అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవం ఏమిటో కళ్ళముందు కనబడుతున్నా కూడా జనాలు చారిత్రాత్మక తీర్పివ్వాలని ఎలా పిలుపిస్తున్నారో అర్ధం కావటం లేదు.