Begin typing your search above and press return to search.

తల్లిని ఒంటరిగా వదిలేసి అమెరికా పారిపోతున్న ఎన్నారై అరెస్ట్

By:  Tupaki Desk   |   27 Aug 2022 12:36 PM GMT
తల్లిని ఒంటరిగా వదిలేసి అమెరికా పారిపోతున్న ఎన్నారై అరెస్ట్
X
చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులే సర్వస్వం.. కానీ పెరిగి పెద్దయ్యాక పెళ్లామే లోకం.. వృద్ధాప్యంలో కన్నతల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. ఎన్నో సినిమాలు దీనిపై వచ్చాయి.

ఈ కోవలోనే ఓ కొడుకు తన అమెరికా కల కోసం భర్తను కోల్పోయిన వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వదిలేసి పారిపోవాలని చూశాడు. ఒంటరిగా మిగిలిన తల్లిని వదిలేసి విదేశాలకు పోవాలని చూశాడు. కానీ ఆ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని చెన్నైలో సంచలనం సృష్టించింది.

చెన్నై మైలాపూర్ కు చెందిన దుర్గాంబాళ్ (74) అనే వృద్ధురాలు ఈనెల 15న తన కుమారుడు రామకృష్ణన్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ‘నా భర్త కుప్పుస్వామి జులై 3న మరణించాడని.. పెద్ద కుమారుడు రెండేళ్ల క్రితం చనిపోయాడని.. రెండో కుమారుడు రామకృష్ణన్ అమెరికాలో భార్యాపిల్లలతో నివస్తున్నాడని.. అంత్యక్రియలకు పిలిచినా రెండో కొడుకు రాలేదని పేర్కొంది.

10 రోజుల తర్వాత చెన్నైకి వచ్చిన చిన్న కొడుకు భర్త చనిపోయి ఒంటరిగా మిగిలిన తనకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరినా.. నిరాకరించాడని.. ఆవేదన వ్యక్తం చేసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిన తనకు సాయం చేసేందుకు నిరాకరించిన రామకృష్ణన్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కొడుకు మీదనే ఫిర్యాదు చేసిన తల్లి కోరిక మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రామకృష్ణన్ ను విదేశాలకు వెళ్లకుండా చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు.

ఈనెల 22న తెల్లవారుజామున 3 గంటలకు రామకృష్ణన్ పోలీసుల కళ్లుగప్పి అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. పాస్ పోర్టు తనిఖీ సందర్భంగా పోలీసుల లుక్ ఔవుట్ లో ఉండడం కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మైలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రామకృష్ణన్ ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని ఆదుకోని కుమారుడు ఇలా కటకటాల పాలయ్యాడు.