Begin typing your search above and press return to search.

విడిపోయిన తల్లిదండ్రుల్ని కలపలేకపోయానని ఉరేసుకున్నాడు

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:35 AM GMT
విడిపోయిన తల్లిదండ్రుల్ని కలపలేకపోయానని ఉరేసుకున్నాడు
X
బంధాలు.. అనుబంధాల ఉసురు తీసే ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఎవరిని ఎవరూ నమ్మలేనట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్న ఈ ఉదంతాలు కొత్త సందేహాలకు తావివ్వటమే కాదు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో.. బంధాల కోసం తపించిన ఒక కుర్రాడు.. దానిలో బంధీ కావటం.. తాను అనుకున్నది చేయలేకపోయానన్న బాధతో తన ప్రాణాలు తీసుకున్న విషాదం తాజాగా సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నర్సయ్య.. నాగవ్వలు దంపతులు. వారికి ఒక కుమారుడు. వారిద్దరూ మనస్పర్థల కారణంగా పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. వీరి కుమారుడు ప్రశాంత్ కు ఇప్పుడు 22 ఏళ్లు. తనకు ఏడేళ్ల వయసులో ఉన్న వేళలో తల్లిదండ్రులు విడిపోవటం.. దీంతో తల్లి.. తండ్రిని ఒక్కచోట చూడలేక అతగాడుపడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అందుకే.. విడిపోయిన తన తల్లిదండ్రుల్ని కలపాలని అతను ప్రయత్నాలు చేశాడు.

తల్లిదండ్రుల వద్ద విడిపోయిన తర్వాత ప్రశాంత్ తండ్రి దగ్గరే ఉంటున్నాడు. జిల్లాలోని వేములవాడ రూరల్ మండలంలో ఉండే తన తల్లి నాగవ్వ వద్దకు తరచూ వెళ్లేవాడు. తమ ముగ్గురం కలిసి ఉందామని తరచూ మాట్లాడేవాడు.అయితే.. ఇందుకుతల్లి నాగవ్వ ఒప్పుకోలేదు.

దీంతో అతగాడు తీవ్ర మనోవ్యధకు గురయ్యేవాడు. కన్నవారిని ఒకచోటకు చేర్చి తాను వారితో కలిసి ఉండాలన్న అందమైన కలను పెంచుకున్న ప్రశాంత్.. తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవటంతో తీవ్రమైన మనోవ్యధకు గురయ్యారు.

రెండు రోజుల క్రితం తల్లి వద్దకు వచ్చాడు. తండ్రితో పాటు తనతో కలిసి ఉండాలని కోరాడు. అయితే.. అందుకు ఆమె నో చెప్పటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంటికి వచ్చిన అతను ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో.. ఆ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు విడిపోయే కుటుంబాల్లో పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెబుతున్నారు. పాపం అనిపించే ఈ ఉదంతంలో ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయిన వైనంపై ఆవేదన వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.