Begin typing your search above and press return to search.

5 పైసల కేసులో 40 ఏళ్ల పోరాటం

By:  Tupaki Desk   |   5 May 2016 1:13 PM GMT
5 పైసల కేసులో 40 ఏళ్ల పోరాటం
X
నలభయ్యేళ్లుగా ఆయన కోర్టులో పోరాడుతున్నాడు.. నలభయ్యేళ్లుగా పట్టువిడవకుండా పోరాడుతున్నాడంటే కోట్లాది రూపాయల ఆస్తి కోసమో లేదంటే కొంపలు మునిగిపోయే విషయమో అయ్యుంటుందని అనుకోవద్దు. ఆయన పోరాటం కేవలం 5 పైసల కోసం.. అవును.. 5 పైసల కోసం రణవీర్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ రవాణా సంస్థత కోర్టులో యుద్ధం చేస్తున్నాడు. ఆ 5 పైసల కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేశాడు. ప్రస్తుతం 73 సంవత్సరాల వయసు ఉన్న రణవీర్ తన 33వ ఏట వేసిన కేసులో ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇంతకీ కేసేంటో చూద్దామా...?

రణవీర్ 1973లో ఢిల్లీ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసేవాడు. అప్పుడాయన ఓ మహిళా ప్రయాణికురాలికి 10 పైసల టికెట్ ఇచ్చి అందులో 5 పైసలు తన జేబులో వేసుకున్నాడని ఆరోపణ వచ్చింది., తనిఖీ అధికారి ఆయన్ను పట్టుకోవడంతో ఢిల్లీ ఆర్టీసీ అధికారులు ఆయన్ను విచారించారు. 1975లో ఆయన్ను దోషిగా తేల్చి ఉద్యోగం నుంచి తీసేశారు. దీనిపై కేసు వేసిన రణవీర్ 1990లో లేబర్ కోర్టులో విజయం సాధించాడు. దీంతో అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమంటూ లేబర్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ ట్రాన్సుపోర్టు కార్పొరేషన్ హైకోర్టుకు వెళ్లింది. కేసు అనేక సార్లు విచారణకు వచ్చింది. చివరకు హైకోర్టు ఇటీవల ఆ కేసును కొట్టేసింది. రణవీర్ కు 30 వేల నష్టపరిహారం చెల్లించాలని... గ్రాట్యుటీ - పీఎఫ్ కిందట 2.65 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు... 5 పైసల విషయంలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో చెప్పాలని డీటీసీని ప్రశ్నించింది. కాగా ఈ కేసుపై మరో కోర్టులో మే 26న మరోసారి విచారణ ఉండడంతో అదెంతవరకు వస్తుందో చూడాలి.

అయితే.. ఢిల్లీ ట్రాన్సుపోర్టు శాఖ ఎన్ని కోర్టులకు వెళ్లినా కూడా ప్రతిచోటా రణవీర్ కు అనుకూలంగానే తీర్పులొచ్చాయి. మొత్తానికి 5 పైసలు చలామణీలో లేకుండా పోయి దశాబ్దాలు దాటుతున్నా అయిదు పైసల విషయంలో వేసిన కేసు ఇంకా ఉండడం విచిత్రం.