Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటోలు, వివరాలు విడుదల

By:  Tupaki Desk   |   13 April 2022 6:17 AM GMT
అమెరికాలో కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటోలు, వివరాలు విడుదల
X
అమెరికాలోని బ్రూక్లిన్ మెట్రో రైలు భూగర్భ స్టేషన్ లో కాల్పుల ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్న వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు గుర్తించారు. అతడి ఫొటోలను విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికీ 50వేల డాలర్ల నజరానా ప్రకటించారు.

62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ను ఈ కాల్పులు జరిపిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. ఈ వ్యక్తి ఆరెంజ్ కలర్ కోటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. అతడు వాడిన వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. రైల్వేస్టేషన్ లో దాడి చేసిన వ్యక్తి భూగర్భ రైల్వే స్టేషన్ లో పొగ బాంబులు విసరడానికి ముందు గ్యాస్ మాస్క్ ధరించాడు. అనంతరం కాల్పులు ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఈ కాల్పుల్లో 10 మందికి బుల్లెట్ గాయాలు కాగా.. మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. నిందితుడు ప్రజలపై కాల్పులు జరిపేందుకు వాడిన గ్లాక్ హ్యాండ్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు రెండు పేలని స్మోక్ గ్రనేడ్లు, మూడు తుపాకీ మ్యాగ్జైన్లు గుర్తించారు.

నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి? అనే విషయంపై ఆరాతీస్తున్నారు. అతడు ఒంటరిగా ఉంటాడని.. సైకోగా మారాడని ప్రచారం సాగుతోంది. ఉగ్రవాద కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడు ఆరెంజ్ బనియన్, గ్యాస్ మాస్క్ ధరించి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. గాయపడిన వారంతా సేఫ్ అని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ స్పందించారు. కాల్పుల్లో గాయపడిన వారి సాయం చేసిన తోటి ప్రయాణికులకు ఆక్ష్న ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో తుపాకుల నియంత్రణకు జోబైడెన్ సర్కార్ కొత్త నిబంధనలు విధించిన ఒక్కరోజు తర్వాత ఈ కాల్పులు జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇప్పటికే అమెరికాలో ఇలా తుపాకీ కాల్పుల్లో ఏకంగా 40వేల మంది మరణించారు