Begin typing your search above and press return to search.

జేసీలతో పెరిగిపోతున్న తలనొప్పి

By:  Tupaki Desk   |   14 May 2022 5:58 AM GMT
జేసీలతో పెరిగిపోతున్న తలనొప్పి
X
అనంతపురం జిల్లా పార్టీలో చంద్రబాబునాయుడుకు తలనొప్పులు పెరిగిపోతున్నాయి. మొదటినుండి ఈ జిల్లాలో టీడీపీ నేతల మధ్య చాలా గొడవలే ఉన్నాయి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సమస్యలు పరిష్కరించుకోవాల్సందిపోయి గొడవలను మరింతగా పెంచుకుంటున్నారు. జిల్లా మొత్తం నేతల వరస ఒకవిధంగా ఉంటే జేసీ బ్రదర్స్ వరస మాత్రం మరోరకంగా ఉంటుంది.

ప్రస్తుతానికి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాస్త కామ్ గా ఉన్నారుకానీ మాజీ ఎంఎల్ఏ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పార్టీలో చిచ్చుపెట్టడానికి రెడీ అయిపోయారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటానికే తాను బస్సుయాత్ర చేస్తానని చెబుతున్న ప్రభాకర్ నిజానికి పార్టీలో చిచ్చు పెడుతున్నారు. తన పర్యటన వల్ల జిల్లా పార్టీలో గొడవలవుతాయని బాగా తెలిసే ప్రభాకర్ రెడ్డి కావాలనే టూర్ పెట్టుకున్నారు.

వీళ్ళతో ప్రధానమైన తలనొప్పి ఏమిటంటే పుట్టపర్తి, అనంతపురం టౌన్, కదిరి, గుత్తి, కల్యాణదుర్గం, శింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లో మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలకు ప్యారలల్ గా తమ మద్దతుదారులను ప్రోత్సహిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ మద్దతుదారులకే టికెట్లు తెచ్చుకోవటంలో భాగంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో సీనియర్ నేతలంతా అభద్రత ఫీలవుతున్నారు. అందుకనే ప్రభాకర్ రెడ్డి నిర్వహించాలని అనుకున్న యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఎవరెంత వ్యతిరేకించినా తానుమాత్రం పర్యటన చేసేది చేసేదే అని గతంలోనే ప్రభాకర్ ప్రకటించారు. అప్పుడు చెప్పినట్లుగానే తాజాగా పుట్టపర్తి టూర్ మొదలుపెట్టారు. దీంతో మాజీమంత్రి పల్లె రఘునాధరెడ్డి మద్దతుదారులు యాత్రను వ్యతిరేకించేందుకు రెడీ అయిపోయారు.

దాంతో పార్టీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని రెండువర్గాలను ఆపాల్సొచ్చింది. పోలీసులు అతికష్టంమీద ప్రభాకర్ ను అక్కడినుండి పంపేయటంతో గొడవ జరగలేదు. ఇపుడు జరిగింది చూస్తుంటే జేసీలతో చంద్రబాబుకు ముందు ముందు పెద్ద తలనొప్పి తప్పేట్లులేదు. ఇఫ్పుడే చంద్రబాబు వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎన్నికల సమయానికి వీళ్ళే భస్మాసురులైపోయినా ఆశ్చర్యంలేదు.