Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఖమ్మం సభ ఏర్పాట్లలో హెల్త్ డైరెక్టర్ బిజీబిజీ

By:  Tupaki Desk   |   17 Jan 2023 12:30 AM GMT
కేసీఆర్ ఖమ్మం సభ ఏర్పాట్లలో హెల్త్ డైరెక్టర్ బిజీబిజీ
X
కేసీఆర్ ఖమ్మం సభకు బీఆర్ఎస్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి హరీశ్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. అయితే.. హరీశ్ రావుతో పాటు మరో వ్యక్తి కూడా కేసీఆర్ ఖమ్మం సభ కోసం అన్నీతానే అయి ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే ఆయన రాజకీయ నాయకుడు కాదు. తెలంగాణలో కీలక శాఖలో ఉన్నాధికారి. అవును... తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఖమ్మంలో కేసీఆర్ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారట. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం దగ్గరల్లోనే ఉందని.. త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరుతారని అంటున్నారు.

డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలంగాణ హెల్త్ డైరెక్టరుగా చాలామందికి సుపరిచితులే. కోవిడ్ సమయంలో ఆయన సమర్థంగా పనిచేశారని ప్రజల్లో పేరుంది.. ప్రజలకు కోవిడ్ పట్ల జాగ్రత్తలు చెప్తూనే ఆ భయం నుంచి బయటపడేలా ఆయన దిశానిర్దేశం చేయడంలో చాలావరకు సఫలీకృతులయ్యారు. అయితే, ఇటీవల కాలంలో మాత్రం ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ముఖ్యంగా కేసీఆర్ కాళ్లు మొక్కడం ఒకటైతే... రెండోది ఏసుక్రీస్తు వల్లే కోవిడ్ తగ్గిందని వ్యాఖ్యలు చేయడం.

కేసీఆర్ కాళ్లకు శ్రీనివాసరావు మొక్కడం వెనుక పెద్ద కథే ఉందని అప్పట్లోనే అంతటా వినిపించింది. ఇప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్ కనిపిస్తోందని చెప్తున్నారు. శ్రీనివాసరావు కొత్తగూడెం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని... అందుకోసం కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు.

తన పేరు మీద డాక్టర్ జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కొత్తగూడెంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారాయన. ఉద్యోగ మేళాలు వంటివి ఆయన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో ఆయన కొత్తగూడెం రుణం తీర్చుకుంటానంటూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో సెల్ఫీలు దిగి ఫొటోలు పంపి బహుమతులు పొందండంటూ ఆయన హడావుడి చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కేసీఆర్ సభ ఏర్పాట్లలో ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుండడం కీలక విషయం. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ సభ బాధ్యతలు తీసుకోగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ అధికారి స్థాయిని మించి రాజకీయ నాయకుడిలా ఈ పనులు చూస్తున్నారని విపక్ష నేతలు అంటున్నారు.

కొత్తగూడెంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అక్కడ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఎన్నికల్లో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఇప్పుడు సీపీఐ కూడా బీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఉంది.

అయితే... ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కారణంగా ఆయనపై వ్యతిరేకత ఉంది. కొద్దినెలల కిందట వనమా రాఘవ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం.. ఆ సమయంలో ఆయన చేసిన ఆరోపణలు అన్నీ వనమా కుటుంబానికి చెడ్డపేరు తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మార్చుతారనే టాక్ బీఆర్ఎస్‌లో ఉంది. ఆ అవకాశాన్ని తాను దక్కించుకోవాలని కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయాలని డాక్టర్ శ్రీనివాసరావు అనుకుంటున్నారట. వచ్చే నెలలో ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారని వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.