Begin typing your search above and press return to search.

ఉద్ధానం బాధితుల‌కు కేంద్రం మొండి చేయి!

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:00 PM GMT
ఉద్ధానం బాధితుల‌కు కేంద్రం మొండి చేయి!
X
ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారినపడి డయాలసిస్‌ పొందుతున్న నిరుపేదలకు ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇచ్చే అవకాశం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. అలాంటి పేషెంట్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే నెలసరి 10 వేల రూపాయలు చొప్పున పెన్షన్‌ చెల్లిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని అన్నారు.

వైస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద నిరుపేదలైన దీర్ఘకాల కిడ్నీ రోగులకు ప్రతి జిల్లా ఆస్పత్రితో ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాల్లో 35 కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మంత్రి జవాబుపై స్పందించిన వి.విజయసాయి రెడ్డి అనుబంధ ప్రశ్న అడుగుతూ ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎంత తీవ్రంగా ప్రబలుతోందో అర్థం చేసుకోవాలని మంత్రిని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతాలలో ఉద్ధానం కూడా ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను గుర్తించే మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్కడ పరిశోధనా కేంద్రంతోపాటు 200 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిచాలని నిర్ణయించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆరోగ్య మంత్రికి తెలుసు. కాబట్టి ఉద్ధానం ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజీతోపాటు పలాసలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏటా 2 లక్షల మంది రోగులు కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తుంటే కేవలం 15 వేల కిడ్నీలు మాత్రమే అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో వివరించాలని మంత్రిని కోరారు.