Begin typing your search above and press return to search.

మంత్రి లక్ష్మారెడ్డి మరో స్మృతి ఇరానీయా..?

By:  Tupaki Desk   |   8 Aug 2015 9:31 AM GMT
మంత్రి లక్ష్మారెడ్డి మరో స్మృతి ఇరానీయా..?
X
ఇటీవల విద్యార్హతల ధ్రువపత్రాల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పై వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి విద్యార్హతలూ వివాదంలో పడ్డాయి. ఆయనకసలు వైద్య పట్టా ఉందా అన్న అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో బలమైన ఆరోపణలు చేశారు. స్మృతి ఇరానీ సంగతేమో కానీ లక్ష్మారెడ్డి ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం చూస్తే మాత్రం ఆయన వైద్య పట్టాపై వెయ్యి అనుమానాలొస్తున్నాయి..

గుల్బర్గా యూనివర్సిటీ నుంచి వైద్య పట్టా పొందినట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెబుతున్నారు. కానీ, వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు వింటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. 2004లో ఆయన జడ్చర్ల నుంచి పోటీ చేసినప్పుడు 1988లో తాను గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి బీహెచ్ ఎంఎస్ కోర్సు చేసినట్లు అఫిడవిట్లో వెల్లడించారు. అయితే.. 2014 కు వచ్చేసరికి ఆయన అఫిడవిట్లో వివరాలు మారిపోయాయి... 1987లో గుల్బర్గా లోని హెచ్ కే ఈఎస్ యూనివర్సిటీ నుంచి బీహెచ్ ఎంఎస్ చేసినట్లు పేర్కొన్నారు. రెండు అఫిడవిట్లను పరిశీలిస్తే సంవత్సరం, కాలేజి పేరు కూడా మార్చేశారు. సరే... క్రాస్ చెక్ లేకుండా ఏదో హడావుడిగా నింపేశారని సరిపెట్టుకున్నా... ఆయన చదివిన కాలేజీకి 1996 వరకు గుర్తింపే లేదు. ఆ లెక్కన 1987 అయినా 88 అయినా ఆయన సర్టిఫికెట్ కు గుర్తింపు లేనట్లే. ఈ లెక్కన మంత్రిగారు పెద్ద డాక్టరే అయినట్లున్నారు.

కేంద్రంలో స్మృతి ఇరానీ విద్యార్హతల గురించి రచ్చరచ్చ చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇలా టీఆరెస్ మంత్రిని ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తుందో ఏమో.