Begin typing your search above and press return to search.

సాగు చట్టాలపై సుప్రీం దర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు విన్నారా?

By:  Tupaki Desk   |   12 Jan 2021 6:30 AM GMT
సాగు చట్టాలపై సుప్రీం దర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు విన్నారా?
X
వారాల తరబడి ఇంటిని వదిలేసి.. రోడ్లను అడ్డాలుగా మార్చుకొని నిరసన చేస్తున్న రైతులకు సాంత్వన కలిగించేలా.. సాగు చట్టాల్ని అమలు చేయొద్దని డిమాండ్ చేస్తున్న రైతుల వాదనను పట్టించుకోకుండా.. తానే మాత్రం దిగిరాని కేంద్రం తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఈ నిరసనపై ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మోడీ సర్కారు చేస్తున్న తప్పుల్ని.. వేలెత్తి చూపటంలో సుప్రీం ధర్మాసనం అస్సలు వెనుకాడలేదు. నిరసన చేస్తున్న వారికి ఎలా సర్ది చెప్పాలన్న విషయంపై కేంద్రం అనుసరించిన విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపింది. అవేమంటే..

- కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ సమస్యను మీరు పరిష్కరించలేకపోయారని చెప్పడానికి చింతిస్తున్నాం.

- చర్చలు జరపకుండా చట్టాలు చేసినందువల్లే ఆందోళనలు తలెత్తాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీదే.

- మీరు చేసిన చట్టాల మీద అనేక రాష్ట్రాలు తిరగబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము అమలు చేయమని తీర్మానాలు చేస్తున్నాయి.

- దీనికి ఏమంటారు? చట్టాల రాజ్యాంగబద్ధత గురించి ప్రస్తుతం మనం విచారణ జరుపుతున్నాం. మీరేమో చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు?

- నిరసన చేస్తున్న వారితో చర్చలెందుకు విఫలమవుతున్నాయంటే.. ప్రభుత్వమేమో క్లాజుల వారీగా అభ్యంతరాలపై చర్చిస్తామంటోంది.. రైతులేమో చట్టాల రద్దును కోరుతున్నారు. దీనికి పరిష్కారం కమిటీ ఏర్పాటే. అది ఓ పరిష్కారం చూపే వరకు చట్టాల అమలు నిలిపటమే సబబు.

- చట్టాల అమలు ఆపడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటి?

- మేం చట్టాల రద్దు కోరట్లేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు అమలు ఆపాలంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాలను అమలు చేసి తీరాలన్న పట్టుదల మీకెందుకు?

- జరుగుతున్న పరిస్థితుల్ని చూశాకే మేం విచారణ సమయంలో (డిసెంబరు 17న)నే చట్టాల అమలు నిలిపివేయాలని మీకు సూచన చేశాం.

- మీరేమో చర్చలు జరుపుతున్నాం. గడువును ఇవ్వండన్నారు. ఇప్పటివరకు తేల్చలేకపోయారు.

- మీరే కనుక బాధ్యతాయుతంగా వ్యవహరించాలనుకుంటే చట్టాల అమలు ఆపండి. మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఈ దేశ సుప్రీంకోర్టుగా మేం ఆ చట్టాలపై స్టే ఇస్తాం.

- చట్టాల వల్ల ఇదీ లాభం అని వాటిని సమర్థిస్తూ ఒక్క పిటిషన్‌ దాఖలు కాలేదు.

- ఇప్పటిదాకా ప్రభుత్వం ఆలస్యం చేసింది. అసలు ప్రభుత్వం సమస్య వైపు ఉందో లేక పరిష్కారం కోరుకుంటోందో అర్థం కావడం లేదు.

- మీ జాప్యం వల్ల రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శాంతికి విఘాతం కలిగించే ఘటనలు జరిగితే, రక్తపాతం జరిగితే ఎవరిది బాధ్యత?

- చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే వారిని కోర్టు రక్షించదు. రైతు ఆందోళనను మేం నిలిపేయడం సాధ్యం కాదు. నిరసన తెలుపుతున్న గొంతును నొక్కేస్తున్నారన్న విమర్శను మేం ఎదుర్కోదలుచుకోలేదు.