Begin typing your search above and press return to search.

యువ‌కుల్లో గుండెపోటు.. ఇదిగో షాకింగ్ స‌ర్వే!

By:  Tupaki Desk   |   4 Oct 2022 1:30 PM GMT
యువ‌కుల్లో గుండెపోటు.. ఇదిగో షాకింగ్ స‌ర్వే!
X
ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఐటీ పార్క్ అని బెంగ‌ళూరు న‌గ‌రానికి పేర్లు. అలాంటి ఈ న‌గ‌రంలో ఇప్పుడు గుండె జ‌బ్బుల వ్యాధి బాధితులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ మేర‌కు చేసిన అధ్య‌య‌నంలో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వృద్ధుల్లోనో, వ‌య‌సు మ‌ళ్లిన‌వారిలోనూ గుండె జ‌బ్బులు ఉన్నాయ‌నుకుంటే పొర‌పాటే. యువ‌కుల్లోనూ, మ‌ధ్య వ‌య‌సువారిలోనూ గుండెపోట్లు పెరుగుతున్నాయ‌ని ప్ర‌ముఖ‌ వైద్య నిపుణులు చెబుతుండ‌టం బెంగ‌ళూరు న‌గ‌రంలో అంద‌రిలో ఆందోళ‌న రేపుతోంది.

ముందుగానే చెప్పుకున్న‌ట్టు ఐటీ సిటీ అయిన బెంగ‌ళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువ‌. మంచి చ‌దువులు, వేత‌నాల‌తో యువ‌కులు కోరుకున్న కొలువుల‌ను ఇక్క‌డ ద‌క్కించుకుంటున్నారు. అయితే అంతేస్థాయిలో ఒత్తిడి, ఉరుకుల ప‌రుగుల‌తో కూడిన జీవ‌నం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అస్త‌వ్య‌స్త జీవ‌న శైలితో జీవ‌నం యాంత్రికంగా మారిపోయింద‌ని అంటున్నారు. దీంతో చిన్న వ‌య‌సులోనే గుండె జ‌బ్బుల‌తో ఆస్ప‌త్రుల్లో చేరేవారి సంఖ్య బెంగ‌ళూరు న‌గరంలో పెరుగుతోంద‌ని పేర్కొంటున్నారు.

బెంగ‌ళూరు న‌గ‌రంలో ప్రముఖ హృద్రోగ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. అందులోనూ యువత, మధ్య వయసువారే ఎక్కువగా గుండె పోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంద‌ని అంటున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే బెంగ‌ళూరు న‌గ‌రంలో గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య 30 శాతం కంటే అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. కోటికి పైగా జ‌నాభా ఉన్న బెంగ‌ళూరు న‌గ‌రంలో ట్రాఫిక్ జామ్‌లు, వాయు కాలుష్యం ఎక్కువని చెబుతున్నారు. వీటికి ఒత్తిడితో కూడుకున్న జీవితం, శారీరక శ్ర‌మ లేక‌పోవ‌డం వంటివి తోడై చిన్న వ‌య‌సులోనే యువ‌కులు గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నార‌ని పేర్కొంటున్నారు.

ప్ర‌తి వంద‌మందిలో 50 శాతం మంది శారీరక కదలికలు లేని ఉద్యోగాలు చేయ‌డం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె బలహీన‌ప‌డుతోంద‌ని వైద్య నిపుణులు బాంబుపేల్చారు. బెంగ‌ళూరులో ప్ర‌ముఖ హార్ట్ ఆస్ప‌త్రి నారాయణ మల్టీ స్పెషాలిటీలో కరోనా అనంతరం 55 ఏళ్లు వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు గుండె సమస్యలతో రావడం 30 శాతం పెరిగింద‌ని అంటున్నారు. గత ఒక్క ఏడాదిలోనే నమోదైన మొత్తం గుండె జ‌బ్బుల‌ రోగుల్లో 70 శాతం మంది 25–55 వయసు మధ్యవారేనని చెబుతున్నారు.

అలాగే మ‌రో ప్ర‌ముఖ ఆస్ప‌త్రి జయదేవ హృద్రోగ ఆస్ప‌త్రికి ఏడాదికి సరాసరి 6 లక్షల మందికి పైగా వైద్యం కోసం వస్తున్నారు. ఇక్క‌డ ఏటా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టితో పాటు 40 వేల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి 100 మందిలో 30 మంది 40 ఏళ్లు లోపు వయసు వారే ఉండ‌టం బెంగ‌ళూరులో యువకులు గుండె జ‌బ్బుల బారిన‌ప‌డుతున్నార‌నేందుకు నిద‌ర్శ‌నం.

గుండెపోటు సాధార‌ణంగా ఒకేసారి రాద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ గుండె సీటీ స్కాన్‌ తీయించుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ పరీక్షతో రక్తనాళాలు బ్లాక్‌ అయి ఉంటే తెలుస్తుందంటున్నారు.

సమగ్ర ఆరోగ్య కేంద్ర సంస్థ... ప్రాక్టో దేశంలోని ప్రముఖ మహానగరాల్లో అధ్య‌య‌నం నిర్వ‌హించింది. గ‌త‌ మూడు నెలల్లో బెంగళూరులో గుండెపోటుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు 200 శాతం పెరిగినట్లు బాంబుపేల్చింది. గత రెండేళ్లలో గుండె జబ్బులతో అనేక మంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజల్లో జాగ్రత్త పెరిగింది. గత మూడునెలల్లో గుండె పరీక్షల కోసం ఆస్పత్రులకు వ‌చ్చిన‌వారిలో 56 శాతం మంది 30–39 ఏళ్లులోపు వారే ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.