Begin typing your search above and press return to search.

ఆ జిల్లాల్లో తమ్ముళ్ళకు గుండె దడ...?

By:  Tupaki Desk   |   15 April 2022 7:27 AM GMT
ఆ జిల్లాల్లో తమ్ముళ్ళకు గుండె దడ...?
X
అవును. తమ్ముళ్ళకు ఇపుడు గుండె దడ ఎక్కువ అయిందట. వారిలో ఆశలు అన్నీ నీరు కారిపోతున్నాయట. దానికి కారణం పొత్తుపొడుపులు, వాటి పిలుపులూ టీడీపీలో గట్టిగా వినిపించడమే. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఈ మేరకు తెర వెనక కసరత్తులు గట్టిగానే సాగుతున్నాయి.

జనసేనతో టీడీపీ పొత్తు దాదాపుగా కంఫర్మ్ అని అంటున్నారు. అయితే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడ ఇస్తారు అన్న దాని మీదనే ఇపుడు విస్తృత స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. జనసేనకు బలం, బలగం అంతా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది. దాంతో పాటు ఉత్తరాంధ్రాలో కూడా జనసేన ఇపుడు బాగా పుంజుకుంటోంది.

దాంతో ఈ మొత్తం రెండు ప్రాంతాల్లో కలిపి అరవై ఎనిమిది సీట్లకు గానూ కనీసంగా నలభై దాకా సీట్లను జనసేన డిమాండ్ చేయడం ఖాయమని అంటున్నారు. అంటే ఆ మేరకు టీడీపీ ఆశావహులు సర్దుబాటు చేసుకోవాలన్న మాట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని గట్టిగా నమ్ముతున్న తమ్ముళ్ళు ఇపుడిపుడే జనాల్లోకి వస్తున్నారు.

తమ పట్టుని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గతంలో టికెట్ రాక చంద్రబాబు ఇచ్చిన హామీతో పార్టీనే అట్టేపెట్టుకుని పనిచేస్తున్న వారంతా కూడా ఇపుడు పొత్తు దెబ్బకు చిత్తు అయిపోతామని కూడా తెగ‌ కంగారు పడుతున్నారుట. అలా కనుక చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి నర్సాపురం జిల్లా దాకా అన్ని చోట్లా తమ్ముళ్లకు టికెట్ ఫియర్ పట్టుంది అంటున్నారు.

పొత్తుల వల్ల తమకు టికెట్లు రాకపోతే ఏం చేయాలి అన్నదే వారి బాధగా ఉందని అంటున్నారు. పొత్తుల పేరుతో పక్క పార్టీ వారిని మోస్తే రేపటి రోజున వారు తమ సొంత ఏరియాల్లో పాతుకుపోతే తమ క్యాడరూ పలుకుబడి కూడా గల్లంతు అవుతాయని కూడా బెంబేలెత్తుతున్నారుట.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ అధినాయకత్వం మాత్రం చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తోంది. పొత్తుల వల్ల కచ్చితంగా యాభై దాకా సీట్లను మిత్రులకు త్యాగం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి మరీ దానికి తగినట్లుగా పార్టీలో ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది. ఈ మొత్తం పరిణామాలతో తమ్ముళ్ళు మాత్రం కలవరపడుతున్నారు. పొత్తులు కుదరకపోతేనే బాగుండు అన్న భావన కూడా వారి నుంచి వ్యక్తం అవుతోందిట. మరి టీడీపీలో ఈ పొత్తుల కధ ఎంతదాకా వెళ్తుందో చూడాల్సిందే.