Begin typing your search above and press return to search.

కాబూల్ లో హృదయ విదారక దృశ్యాలు

By:  Tupaki Desk   |   22 Aug 2021 10:54 AM GMT
కాబూల్ లో హృదయ విదారక దృశ్యాలు
X
అప్ఘనిస్తాన్ దేశం కరుడుగట్టిన తాలిబన్ల వశమైనప్పటి నుంచి ప్రతిరోజు హృదయ విదారక ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కాబూల్ విమానాశ్రయంలో దేశం విడిచి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తరలిరావడం.. విమానాల వెంట పరిగెట్టడం.. విమానాల నుంచి కింద పడిన వీడియోలు ప్రతి ఒక్కరిని కదిలించాయి.

తాలిబన్ల అరాచక పాలనకు భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబన్లు ఇనుక కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపలను చేతపట్టుకున్న అప్ఘన్ ప్రజలు .. ఇక వీరిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనను పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులకు భయపడి పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానెల్ లో ప్రసారమై వైరల్ గా మారింది.

ఒకరిద్దరూ సాయుధులైన తాలిబన్లు గాల్లోకి వదులుగా ఎదురుగా ఉన్న జనం వైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

ఇక అమెరికాకు మద్దతుగా నిలిచిన అప్ఘన్లను తరలిస్తామని అధ్యక్షుడు జోబైడెన్ హామీ ఇవ్వడంతో కట్టుబట్టలతో చాలా మంది తమకు రక్షణ దొరుకుతుందో ఏమోనని కాబూల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకు కూడా రావద్దని అప్ఘాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఎవరి ప్రాణాలకు భద్రత లేదని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఈనెల 31లోగా అమెరికన్లను దేశం తరలిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని రాయబార కార్యాలయం తెలిపింది.