Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ని న‌మ్మం స‌రే.. మిమ్మ‌ల్ని ఎలా న‌మ్మాలి జ‌గ‌న్ భ‌య్యా?

By:  Tupaki Desk   |   29 July 2022 5:30 PM GMT
ప‌వ‌న్ ని న‌మ్మం స‌రే.. మిమ్మ‌ల్ని ఎలా న‌మ్మాలి జ‌గ‌న్ భ‌య్యా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక‌వ‌ర్గంగా ఉన్న కాపులు వైఎస్సార్సీపీకి జెల్ల‌కొట్టే అవ‌కాశం ఉంద‌ని ఇప్ప‌టికే విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కాపుల‌ను త‌మ వైపుకు తిప్పుకోవ‌డానికి వైఎస్సార్సీపీ బాగానే క‌ష్ట‌ప‌డుతోంద‌ని అంటున్నారు. అయితే సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆశ‌లు ఫ‌లించ‌వ‌ని పేర్కొంటున్నారు.

తాజాగా వైఎస్సార్ కాపు నేస్తం నిధుల‌ను జ‌మ చేయ‌డానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జూలై 29న తూర్పుగోదావ‌రి జిల్లా గొల్ల‌ప్రోలుకు వెళ్లారు. అక్క‌డ బ‌ట‌న్ నొక్కి నిధుల‌ను జ‌మ చేశాక సీఎం జ‌గ‌న్, కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్.. చంద్ర‌బాబుకు ద‌త్త‌పుత్రుడ‌ని, కాపుల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా చంద్ర‌బాబుకు అమ్మేస్తాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ ను న‌మ్మొద్ద‌ని.. కాపుల‌కు సిస‌లైన కాపు కాసేది తామేన‌ని జ‌గ‌న్ చెప్పారు.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై కాపులు మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ కాపుల‌కు చేసింది శూన్య‌మ‌ని అంటున్నారు. అధికారంలోకి వ‌చ్చీ రాగానే కాపుల రిజ‌ర్వేష‌న్ త‌న ప‌రిధిలో అంశం కాద‌ని.. తానేమీ చేయ‌లేన‌ని ప‌క్కకు త‌ప్పుకున్నార‌ని గుర్తు చేస్తున్నారు. అలాగే కాపు, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పెన్నిధి వంగ‌వీటి రంగాను దూషించిన రెడ్డి కులానికి చెందిన గౌత‌మ్ రెడ్డిని సస్పెండ్ చేసిన‌ట్టే చేసి ఆ త‌ర్వాత‌ ఏపీ పైబ‌ర్ నెట్ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌ని కాపులు అంటున్నారు. అలాగే వంగవీటి రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధాకు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం సీటు ఇవ్వ‌కుండా జ‌గ‌న్ అవ‌మానించార‌ని మండిప‌డుతున్నారు. పైగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల లిస్టు ఇచ్చి ఇందులో ఏదో ఒక‌టి తీసుకో అని రాధాను ఆదేశించార‌ని.. అది న‌చ్చ‌ని రాధా వైఎస్సార్సీపీకి గుడ్ బై కొట్టార‌ని గుర్తు చేస్తున్నారు.

అలాగే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వంగ‌వీటి రంగా జ‌యంతి, వ‌ర్థంతుల‌కు ఆయ‌న చిత్ర‌ప‌టాల‌కు, విగ్ర‌హాల‌కు దండ‌లు వేసిన జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఒక్క‌సారి కూడా క‌నీసం నివాళి అర్పించ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. కొత్త‌గా ఏర్పాటు చేసిన విజ‌య‌వాడ జిల్లాకు వంగ‌వీటి రంగా జిల్లా అని పేరు పెట్టాల‌ని కాపులు డిమాండ్ చేసినా వినీ విన‌న‌ట్టు ఊరుకున్నార‌ని చెబుతున్నారు.

అలాగే కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌త్తి మ‌హేష్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, జ‌గ‌న్ పార్టీలో ఉండి తాను జ‌గ‌న్ పెద‌పాలేరున‌ని చెప్పుకున్న పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, క‌న్న‌బాబు, అవంతి శ్రీనివాస‌రావు, కొట్టు సత్య‌నారాయ‌ణ‌, ఆళ్ల నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమ‌ర్ నాథ్ త‌దిత‌రుల‌తో తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టించిన‌దాన్ని మ‌రిచిపోబోమ‌ని కాపులు జ‌గ‌న్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వం కాపుల‌కు ఐదు శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే జ‌గ‌న్ వ‌చ్చాక దాన్ని ఎత్తేశార‌ని కాపులు గుర్తు చేస్తున్నారు. విదేశీ విద్యా నిధి ప‌థ‌కాన్ని కూడా భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని అంటున్నారు. ఆ ప‌థ‌కం వ‌ల్ల గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఎంతో మంది కాపు విద్యార్థులు విదేశాల‌కు వెళ్లి వివిధ కోర్సులు చ‌దువుకున్నార‌ని జ‌గ‌న్ మాత్రం ఆ ప‌థ‌కానికి గండికొట్టార‌ని కాపులు మండిప‌డుతున్నారు.

ఇక సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌ను తొక్కేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం, సినిమా టికెట్ ను ఐదు రూపాయ‌ల‌కు విక్ర‌యించ‌డం, చిరంజీవిని సినిమా టికెట్ల‌పై చ‌ర్చించ‌డానికి తాడేప‌ల్లికి పిలిపించుకుని చేతులెత్తి మొక్కించుకోవ‌డం ఇవ‌న్నీ తాము మరిచిపోబోమ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ కాపుల స‌త్తా ఏమిటో చూపిస్తామ‌ని కాపులు హెచ్చ‌రికలు జారీ చేస్తున్నారు. ఎంగిలి మెతుకులు, కుక్క బిస్కెట్ల‌కు ఆశ‌ప‌డే పేర్ని నాని, దాడిశెట్టి రాజా, అంబ‌టి రాంబాబు, గుడివాడ అమ‌ర్ నాథ్ లాంటి వాళ్ల‌ను కాపులుగా ప‌రిగ‌ణించ‌డం తామెప్పుడో మానేశామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి కూడా బుద్ధి చెబుతామ‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు.

ముఖ్యంగా పేర్ని నానితో సొంత కులాన్నే తిట్టించిన జ‌గ‌న్ కు గుణ‌పాఠం త‌ప్ప‌కుండా నేర్పుతామ‌ని కాపులు హెచ్చ‌రిస్తున్నారు. జ‌గ‌న్ ఎన్ని క‌ల్లిబొల్లి మాట‌లు చెప్పినా 25 శాతం కాపు సామాజిక‌వ‌ర్గం ఈసారి న‌డిచేది ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనేని ఢంకా బ‌జాయించి చెబుతున్నారు.