Begin typing your search above and press return to search.

టార్గెట్ పవన్ : వైసీపీ వ్యూహమా... వ్యూహాత్మక తప్పిదమా...?

By:  Tupaki Desk   |   5 Nov 2022 2:30 PM GMT
టార్గెట్ పవన్ : వైసీపీ వ్యూహమా... వ్యూహాత్మక తప్పిదమా...?
X
ఏపీలో సడెన్ గా జనసేన గ్రాఫ్ పెరుగుతోంది. అది ఎంతలా అంటే ఇపుడు ఏపీలో పాలిటిక్స్ చూస్తే వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే సీన్ కనిపిస్తోంది. జగన్ విత్ పవన్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. తెలుగుదేశం వంటి బలమైన పార్టీ వెనక్కువెళ్తోంది. చంద్రబాబు తరచూ మీటింగ్స్ పెడుతూ జనంలో తిరుగుతున్నా ఫోకస్ మాత్రం పవన్ మీదకే వెళ్తోంది. పవన్ సైతం బస్తీమే సవాల్ అంటూ జగన్ సర్కార్ మీద అటాక్ చేస్తున్నారు. టార్గెట్ పవన్ అన్నది ఇపుడు వైసీపీ చేస్తోంది అన్నట్లుగానే విశ్లేషణలు ఉన్నాయి.

అయితే ఇది పక్కా వ్యూహమా లేక వ్యూహాత్మకమైన తప్పిదమా అన్నదే చర్చగా ముందుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఏపీ అసెంబ్లీలో టెక్నికల్ గా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కానీ నిజానికి ఆ ఎమ్మెల్యే సైతం వైసీపీలోనే ఉన్నారు. అలా కనుక చూసుకుంటే పవన్ తానుగా రెండు చోట్ల ఓటమి చెందిన నాయకుడు. మరి చట్ట సభలో బలం లేని పార్టీ ఏపీలో 175 నియోజకవర్గాలలో సంస్థాగతంగా ఇంకా గట్టి పడని పార్టీ జనసేనగా ఉంది.

మరో వైపు 151 సీట్లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, 30 మంది దాకా ఎంపీలతో వైసీపీ బలంగా ఉంది. అలాంటి వైసీపీకి పవన్ కళ్యాణ్ జనసేనను అలా వదిలేస్తే పోయేది కదా అన్న చర్చ ఉంది. ఏపీలో వైసీపీకి నిజమైన సవాల్ టీడీపీ నుంచే కదా అన్నది కూడా ఒక పాయింట్. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా గ్రౌండ్ లెవెల్లో టీడీపీ చాలా పటిష్టంగా ఉంది. ఒక ఎన్నికతో ఓడే పార్టీ టీడీపీ కానే కాదు. మరి అలాంటి టీడీపీని వదిలేసి పవన్ని ఎందుకు ముందుకు తెస్తున్నారు. ఆయన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే అక్కడ ఉంది అసలు కధ అంటున్నారు.

ఏపీలో జనసేన టీడీపీ పొత్తులకు రెడీ అయిపోతున్నాయి. ఆ విషయం చాలా కాలంగా నలుగుతున్నదే. వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలు కలుస్తాయని కూడా వైసీపీకి తెలుసు. అయితే ఈ ఇద్దరూ కలవకూడదు అన్నది వైసీపీ మొదటి అజెండా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కలయిక జరగకుండా చూడాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఒకవేళ కలిస్తే కూడా ఆ పొత్తుల ఫలితాలు సక్రమంగా ఉండకుండా అది తమకే అంతిమంగా ఉపయోగపడాలన్నది ప్లాన్ టూ గా ఉంది.

ముందుగా ప్లాన్ వన్ గురించి చెప్ప్కుంటే పవన్ని అమాంతం పెంచేసి ఏపీ రాజకీయాల్లో ముందుకు తేవడం వల్ల ఏమి జరుగుతుంది అంటే జనసేనలో ధైర్యం వచ్చేసి ఒంటరి పోటీకి సై అనవచ్చు. అలా విధంగా ఏపీలో ట్రయాంగిల్ పోరు సాగాలన్నది వైసీపీ ఎత్తుగడ. ఒక వేళ అలా కాకున్నా జనసేన టీడీపీతో జూనియర్ పార్టనర్ గా ఉండడానికి అంగీకరించే సీన్ ఉండదు. మీతో సమానంగా మా ఇమేజ్ పెరిగింది. మా గ్రాఫ్ కూడా పీక్స్ లో ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో సీట్ల సర్దుబాటు చేయమంటారు.

అది కూడా రెండు పార్టీల పొత్తునకు ఇబ్బంది అవుతుంది. అన్నేసి సీట్లు జనసేనకు ఇస్తే ఎన్నికల కంటే ముందే టీడీపీలో ముసలం పుట్టి మునగడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. ఇలా ప్లాన్ బీ వల్ల కూడా వైసీపీకి రాజకీయ లాభమే. ఇంత జరిగినా జనసేనకు గ్రాఫ్ పెరిగినా కూడా పవన్ వైసీపీ ఓట్లు చీలకూడదు అన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు చెప్పినట్లుగా సీట్లు తీసుకుని కూటమి కట్టేందుకు ఓకే అంటే అపుడు జనసైనికుల్లోనే అసంతృప్తి మొదలవుతుంది. పార్టీ ఇంతలా పెరిగినా టీడీపీతో ఒదిగి ఉండాల్సిన అవసరం ఏంటి అన్నదే వారి నుంచి పుట్టే ప్రశ్న. ఆ విధంగా చూసినా పొత్తులు సాఫీగా జరిగే సీన్ ఉండదు.

ఇక కాపు సామాజికవర్గంలో ఆలోచనలు పెంచడం అసలైన టార్గెట్. పవన్ ఇంతలా సీరియస్ గా ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతూంటే ఆయనే సీఎం క్యాండిడేట్ అని వారంతా అభిప్రాయానికి వస్తారు. ఆ విధంగా టీడీపీ ప్రకటిస్తేనే పొత్తు పెట్టుకోమని వత్తిడి పెడతారు. ఎటూ టీడీపీ ఆ ప్రతిపాదనకు అంగీకరించదు కాబట్టి పొత్తు పెటాకులు అవుతుంది. ఒకవేళ పొత్తు ఒప్పుకుంటే కాపు సామాజికవర్గం రివర్స్ అవుతుంది. ఇలా అనేక వ్యూహాలతొనే పవన్ని గట్టిగా వైసీపీ టార్గెట్ చేసి ఏపీ రాజకీయాలో బాగా పెంచేస్తోంది అంటున్నారు.

అయితే వైసీపీ వ్యూహాలు బాగానే ఉన్నా కూడా తాము అనుకోని విధంగా పవన్ గ్రాఫ్ ఇంకా బాగా పెరిగి టీడీపీ తో సమానంగా ఆయన ధీటుగా పోటీలో ఉండి చాలెంజ్ చేస్తే అప్పుడు వైసీపీకి అదే అసలైన రిస్క్ అవుతుందేమో అన్న చర్చ కూడా ఉంది. అంటే ఇపుడు వ్యూహాత్మకంగా పవన్ని రెచ్చగొడుతున్న వైసీపీ తాను తీసుకున్న గోయిలో తానే పడుతునందా అన్న బెంగ కూడా ఆ పార్టీలో ఉంది. మొత్తానికి ఏదైతేనేమి ఏపీలో జగన్ చంద్రబాబుతో సమానంగా ఇంకా ఎక్కువగానే పవన్ ఫోకస్ అవుతున్నాడు.ఇది ఏపీ రాజకీయాలను ఏ వైపునకు మలుపు తిప్పుతుందో చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.