Begin typing your search above and press return to search.

32 ఏళ్ల తర్వాత గుజరాత్ లో త్రిముఖ పోరు.. అప్పటికి మోదీ, షా లేనే లేరు

By:  Tupaki Desk   |   4 Nov 2022 4:30 PM GMT
32 ఏళ్ల తర్వాత గుజరాత్ లో త్రిముఖ పోరు.. అప్పటికి మోదీ, షా లేనే లేరు
X
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబరు 1,5 తేదీల్లో పోలింగ్‌ జరుగనుంది. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలున్నాయి. మొదటి విడతలో 89 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. 93 స్థానాలకు 5న పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబరు 8న మరో రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌తో కలిపి గుజరాత్‌ ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. తొలి విడత సీట్లకు 5న (శనివారం), రెండో విడతకు 10న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అయితే, ఈసారి గుజరాత్ పోరు చిత్రం మారింది. ఇప్పటివరకు అంటే.. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతుంది. ఈసారి ముక్కోణపు సమరం జరుగనుంది.

అప్పట్లో జనతా దళ్.. ఇప్పుడు ఆప్..

మూడు దశాబ్దాల కిందట.. 1990 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే.. నాడు త్రిముఖ పోరు జరిగింది. ఇప్పటి తరం వారికి ఎవరికీ తెలియని ఓ పార్టీ అప్పుడు ప్రముఖంగా నిలిచింది. చిత్రమేమంటే.. నాటి ఎన్నికల్లో ఆ పార్టీనే అత్యధిక సీట్లు గెలుచుకుంది. 1990 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు జనతాదళ్ (70), బీజేపీ (67), కాంగ్రెస్ (33) పోటీ చేశాయి. జనతాదళ్ బలమైన పార్టీ కావడంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.

జనతాదళ్ కు చెందిన చిమన్ బాయ్ పటేల్ సీఎం అయ్యారు. తొలుత బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయన తర్వాత కొద్ది కాలానికే వ్యవహారం చెడడంతో కాంగ్రెస్ తో కలిసి సర్కారు ఏర్పాటు చేశారు. మళ్లీ కాంగ్రెస్ కు చెందిన చబిల్ దాస్ మెహతా కొద్ది కాలం సీఎం కావడం.. బీజేపీకి అధికారం దక్కడం.. రాష్ట్రపతి పాలన.. ఇలా అనేక పరిణామాలతో గుజరాత్ లో 1995 నుంచి 1998 వరకు రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ వ్యవధిలోనే శంకర్ సింగ్ వాఘేలా, దిలీప్ పారీఖ్ వంటి నేతలు జనతాదళ్ నుంచి సీఎంలు అయ్యారు. కానీ, ఇంత బలమైన పార్టీ ఆ తర్వాత ఉనికిలో లేకుండా పోయింది.

1998 నుంచి బీజేపీనే..

1998లో బీజేపీ కేశుభాయ్ పటేల్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి ఆ పార్టీదే హవా. భూకంపం, అనంతరం పునరావాస చర్యల్లో వైఫల్యంతో కేశూభాయ్ 2001 అక్టోబరులో వైదొలగారు. ఆయనను పార్టీ సీఎంగా తప్పించి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చేసింది. అలా మోదీ.. 2014 మే వరకు గుజరాత్ సీఎంగా కొనసాగారు.

ఆ రాష్ట్ర చరిత్రలో ఇంతకాలం సీఎంగా పనిచేసింది మోదీ ఒక్కరే కావడం విశేషం. మిగతావారు ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఈ క్రమంలో 1998 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్యనే పోరు సాగింది. ఇప్పుడు మాత్రం కథ మారింది. ఢిల్లీ, పంజాబ్‌లలో గద్దెనెక్కిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గుజరాత్‌పై కన్నేసింది. దీంతో గోవాలో మాదిరిగా ఓట్లను చీల్చేసి తన విజయావకాశాలకు ఆప్‌ గండి కొడుతుందేమోనని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది.

నాడు మోదీ, షా ఎక్కడ..?

ప్రస్తుత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు దశాబ్దాల కిందట రాజకీయంగా పెద్దగా పేరున్న వారు కాదు. మోదీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఉండేవారు. బీజేపీ వ్యవహారాలు చూసేవారు. అయితే, కేశూభాయ్ సర్కారుకు ఎసరు పెడుతున్నారనే ఆయన్ను పార్టీ గుజరాత్ నుంచి ఢిల్లీ పంపింది అనే వాదన ఉంది. ఇక షా 1987లో ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. తర్వాత 1997లో అహ్మదాబాద్ ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.