Begin typing your search above and press return to search.

వ్యక్తిగత దూషణలు వద్దు.. రేవంత్ రెడ్డి పరిణతి.. మిగతావారికి పాఠమే

By:  Tupaki Desk   |   14 Aug 2022 1:30 PM GMT
వ్యక్తిగత దూషణలు వద్దు.. రేవంత్ రెడ్డి పరిణతి.. మిగతావారికి పాఠమే
X
రాజకీయాలే కాదు.. ఏ రంగంలోనైనా హుందాతనం ముఖ్యం. అది గౌరవాన్ని కాపాడుతుంది. గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కూడా. అయితే, రాన్రాను హుందాతనం అనేది కనుమరుగవుతోంది. దూషణలు అందులోనూ వ్యక్తిగత దుర్భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా రాజకీయాల్లో.. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా పోతోంది. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనే సంప్రదాయమే కనుమరుగవుతోంది. భారతీయ కల్చర్ లో అందులోనూ తెలుగు సంపద్రాయంలో ఇది ఏమాత్రమూ వాంఛనీయం కాదు.

తిడుతూ.. సమస్యలు దాటవేస్తూ

ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. పాలక పక్షానికి ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే.. దానిని తక్కువ చేసేందుకు లేదా పక్కదారి పట్టించేందుకు మరో సమస్యను రేపడం, అదీ కాకుంటే తీవ్రంగా దూషించడం.. అదీకాకుంటే కుటుంబ సభ్యులను దుర్భాషలాడడం మామూలైపోయింది. ఇది రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలను మించిన వేధింపు. ఏ సంబంధమూ లేని కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి.. వారిని దూషించడం అంటే.. అది ఏ పార్టీ వారు చేసినా.. తప్పు వారి వైపు ఉందని, దానిని కప్పి పుచ్చుకునేందుకు ఇలా చేశారని స్పష్టంగా తెలిసిపోతుంటుంది.

తెలంగాణ రాజకీయాలు మెరుగే..

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో దూషణలు కాస్త తక్కువే. కానీ, పొరుగు ప్రభావమో ఏమో కానీ, విమర్శలు ఇటీవల కాస్త గాడి తప్పాయి. దూషణలు, వ్యక్తిగతంగా దుర్భాషలాడడం వంటి ఘటనలు ఒకటీ రెండు సార్లు జరిగాయి. అయితే, పొరుగు రాష్ట్రంతో పోలిస్తే దూషణలు, దుర్భాషలు తెలంగాణలో తక్కువే. నాయకులు ఒకటీ,రెండు తీవ్ర స్థాయి పదాలు ఉపయోగించినా తర్వాత సరిదిద్దుకున్న సందర్భాలున్నాయి.

నాయకత్వంలో, వ్యక్తిత్వంలో రేవంత్ పరిణతి

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ పరిణతిని చాటుతోంది. నిన్నటికి నిన్న అద్దంకి దయాకర్ వంటి నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నోరు జారడం వివాదాస్పదం కాగా.. దానిని రేవంత్ సమర్థంగా సంభాళించారు. ఓ నాయకుడిగా తన బాధ్యత ప్రకారం.. దయాకర్ వ్యాఖ్యలకు వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పారు. దయాకర్ కూడా సారీ చెప్పినా, రేవంత్ తనంత తాను సీనియర్ నేతను క్షమాపణ కోరడం చర్చనీయాంశమైంది. అవతలి నాయకుడు ఎలా తీసుకున్నా.. ఈ ఉదంతం రేవంత్ స్థాయిని పెంచింది కూడా.

సమస్యలపై మునుగోడులో చర్చంటూ..

ఇప్పుడు అందరి చూపు ఉన్న మునుగోడుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఆయన చేసిన ఈ సూచన రాజకీయాల్లో అందరూ పాటించాల్సినది కావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికపై కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతుండడంతో ఆ నియోజక వర్గ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల వల్ల పేదలపై పడుతున్న భారం మీద చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెరాస, భాజపా ప్రభుత్వాల వల్ల మోసపోయామని ప్రజలు భావిస్తున్నారని.. 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మోదీ కేవలం ఏడు లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు.

పార్టీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ

మునుగోడులో సమస్యల గురించి మాత్రమే ప్రస్తావించాలని సూచిస్తూనే.. పార్టీ పరంగా బాధ్యతనూ రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా నెరవేర్చారు. ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, భాజపా పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని రేవంత్‌ విమర్శించారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు (ఎస్‌ఎల్‌పీసీ, బ్రాహ్మణవెల్లి), పోడు భూముల సమస్యలు, స్థానికంగా ఉన్న ఇతరత్రా సమస్యలను పరిష్కరించడం కోసం రూ.5వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి భాజపా ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కేసీఆర్‌ చెప్పిందే చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని, వ్యక్తిగత దూషణలు అవసరం లేదని రేవంత్‌ చెప్పారు.

నాయకత్వ స్థాయి పెంచేలా

వాస్తవానికి పార్టీలో రేవంత్ సారథ్యానికి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండ్రోజుల్లో రెండు ఉదాహరణలు రేవంత్ స్థాయిని పెంచడమే కాదు.. ఓ నాయకుడిగా ఆయన ప్రత్యేకతను చాటాయి. మిగతా నాయకులూ ఇలానే వ్యవహరిస్తే రాజకీయాలకు హుందాతనం వస్తుందనడంలో సందేహం లేదు.