Begin typing your search above and press return to search.

‘కిట్టీ.. కుట్టీ’కేసు పుట్ట పెకలుతోంది..: పోలీస్ స్టేషన్ కు భారీగా బాధితుల క్యూ..

By:  Tupaki Desk   |   29 Nov 2021 10:45 AM GMT
‘కిట్టీ.. కుట్టీ’కేసు పుట్ట పెకలుతోంది..: పోలీస్ స్టేషన్ కు భారీగా బాధితుల క్యూ..
X
కిట్టీ పార్టీ పేరుతో మోసం చేసిన శిల్పా అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని ఇతరుల వద్ద నుంచి డబ్బు లాగిన ఈమె వ్యవహారం బయటపడడంతో బాధితులంతా తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. శిల్పా చక్రవర్తి ద్వారా తామంటే.. తాము మోసపోయామని సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీకి ఆశపడి తమ పిల్లల కోసం దాచుకున్న డబ్బునంతా శిల్పాకే అప్పగించామని తాజాగా ఓ మహిళ తన గోడును పోలీస్ స్టేషన్లో వెళ్లబోసుకుంది. అయితే శిల్పా సేకరించిన డబ్బంతా ఓ ఖరీదైన బంగ్లా నిర్మించుకోవడానికే వాడుకుందని పోలీసులు తేల్చారు.

నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో శిల్ప చౌదరి, ఆమె భర్తలు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ విషయం బయటికి రావడంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు. మొదట 2 కోట్ల 50 లక్షలు ఫ్రాడ్ చేసిందని ప్రియా అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన పిల్లల కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఇస్తానంటే శిల్పాకు ఇచ్చామని ఆమె పేర్కొంది. అయితే రెండేళ్ల నుంచి వడ్డీ కట్టకపోగా తిరిగి అసలు మొత్తాన్ని ఇవ్వడం లేదని ఫిర్యాదులో తెలిపింది. ప్రియా ఫిర్యాదుతో శిల్పా వ్యవహారం బయటకు రావడంతో బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు నార్సింగి, మాదాపూర్, జూబ్లి హిల్స్, బంజారా హిల్స్ లన్నింటిలో కలిసి ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

దీంతో శిల్ప చౌదరి మొదట 2 కోట్లు మాత్రమే మోసం చేసిందని అనుకోగా.. ఆ తరువాత ఫిర్యాదుల వెల్లువెత్తుతుండడంతో మొత్తంగా 200 కోట్ల దాకా టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. నార్సింగి పరిధిలో నమోదైన కేసుల ప్రకారం ఆమె రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని గుర్తించారు. జంట నగరాల్లో రూ. 70 కోట్లకు పైగా వసూలు చేరసిందని అంటున్నారు. మొత్తంగా 90 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే కొందరు మోసపోయిన సెలబ్రెటీలు ఫిర్యాదు ఇచ్చేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

సినీ సెలబ్రెటీలే కాకుండా ఇండస్ట్రీయలిస్టులు, ఇతర ప్రముఖులు ఆమె దగ్గర అధికంగా పెట్టుబడి పెట్టారు. హంగు ఆర్భాటం ప్రదర్శించడంతో శిల్పాను పెద్ద మొత్తంగా డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే రియల్ ఎస్టేట్ లో లాభాలు ఇస్తామని ప్రచారం చేయడంతో కొందరు ప్రముఖులు ఆమెకు భారీగానే డబ్బిచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో కిట్టీ పార్టీల పేరుతో మహిళలకు దగ్గరైన శిల్పా ఆ తరువాత వారికి భారీ వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసింది. లాభాలు వస్తే వాటాలు ఇస్తామని చెప్పింది. అయితే అధిక వడ్డీకి ఆశపడిన చాలా మంది కోట్ల రూపాయలు ఆమెకు అప్పజెప్పారు.

అయితే కొందరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చినా.. చాలా మంది పరువు పోతుందనే భయంతో భయటపడడం లేదు. దీంతో ఆమె భారీగానే కుంభకోణానికి పాల్పడిందని అంటున్నారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్పా, ఆమె భర్త శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఇక ఈ దంపతులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలో ఉంటేనే అసలు విషయాలు బయటకు వస్తాయని అందువల్ల కస్టడికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. అయితే ఈ పిటిషన్ వాదనల తరువాత పిటిషన్ పై స్పష్టత రానుంది.