Begin typing your search above and press return to search.

సెల్లార్ లోకి వర్షపునీరు..కారులోనే కన్నుమూత

By:  Tupaki Desk   |   23 Jun 2018 7:42 AM GMT
సెల్లార్ లోకి వర్షపునీరు..కారులోనే కన్నుమూత
X
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. అంబర్ పేట్ 48 మిల్లీ మీటర్లు - నారాయణ గూడలో 31.8 -నాంపల్లి 27.8 - ఎల్బీ నగర్ లో 22.5 జూబ్లీహిల్స్ లో 16 మి. మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్ పల్లిలోని జయనగర్ లో ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. సెల్లార్ లో పార్కింగ్ చేసిన కారులో నిద్రించిన గోపి అనే యువకుడు వరదనీరు వచ్చి కారును ముంచేయడంతో అందులో ఊపిరాడక చనిపోయాడు.

శనివారం తెల్లవారుజామున గమనించిన అపార్ట్ మెంట్ సిబ్బంది అక్కడ నివాసం ఉండే వారు సెల్లార్ లోని నీటిని తోడేసి కారులోపల ఉన్న గోపి మృతదేహాన్ని బయటకు తీశారు. ఉదయం డ్యూటీ ఉండడంతోనే అతడు కారులో నిద్రపోయినట్లు తెలిసింది.

హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు, నాలాలు నిర్మించడంతోనే వరదనీరు ఇలా సెల్లార్ లను ముంచేసిందని.. అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు వాపోయారు. సదురు అపార్ట్ మెంట్ పక్కనే చెరువు ఉందని తెలిపారు.