Begin typing your search above and press return to search.

భారీ వ‌ర్షంతో భాగ్య‌న‌గ‌రి అత‌లాకుత‌లం!

By:  Tupaki Desk   |   21 Sep 2016 6:42 AM GMT
భారీ వ‌ర్షంతో భాగ్య‌న‌గ‌రి అత‌లాకుత‌లం!
X
నిన్న రాత్రి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదు అత‌లాకుత‌ల‌మైపోయింది. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మైపోయాయి. ప్ర‌ధాన రోడ్ల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు కూడా ఎక్క‌డిక‌క్క‌డ ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. వెర‌సి న‌గ‌రంలో జ‌న‌జీవనం స్తంభించిపోయింది. ఐదేళ్ల‌లో రికార్డు స్థాయిలో వ‌ర్షం కురిసిన నేప‌థ్యంలో హుసేన్ సాగ‌ర్ లోకి భారీ ఎత్తున వ‌ర‌ద నీరు చేరుతోంది.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం ఎప్ప‌టికప్పుడు హుసేన్ సాగ‌ర్ లోకి చేరుతున్న వ‌ర‌ద నీటిని ఎప్పటిక‌ప్పుడు బ‌య‌టకు వ‌దిలేస్తున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌ - ఉప్ప‌ల్‌ - కూక‌ట్ ప‌ల్లి - కుత్బుల్లాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లోని నీరు చేర‌గా - అల్విన్ కాల‌నీ - సూరారం కాల‌నీల్లో ఏకంగా ఇళ్ల‌లోకే నీరు చేరిపోయింది. న‌గ‌రంలోని మెజారిటీ ప్రాంతాల్లో రాత్రంతా ఎడ‌తెరిపి లేని వ‌ర్షం కార‌ణంగా రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. కుత్బుల్లాపూర్ ప‌రిధిలోని షాపూర్ న‌గ‌ర్ లో అత్య‌ధికంగా 15.3 సెంటీ మీట‌ర్ల వ‌ర్షం న‌మోదైంది. బొల్లారంలోనూ 8.7 సెంటీ మీట‌ర్ల వ‌ర్షం కురిసింది.

న‌గ‌రంలో కురిసిన భారీ వ‌ర్షంపై కేసీఆర్ ఢిల్లీ నుంచే స‌మీక్షించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ కోసం నిన్న రాత్రికే ఢిల్లీ చేరిన ఆయ‌న నేటి ఉద‌యం అక్క‌డి నుంచే అధికారుల‌తో స‌మీక్షించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే సుర‌క్షిత ప్రాంతాల‌ను త‌ర‌లించాల‌ని ఆయ‌న సూచించారు. హుసేన్ సాగ‌ర్ స‌హా న‌గ‌రంలోని చెరువులు - కుంట‌ల ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు - పోలీసులు సంయుక్తంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకోవాల‌ని ఆయ‌న ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే సైన్యం స‌హాయం కూడా తీసుకోవాల‌ని సూచించారు. వ‌ర్షాల నేప‌థ్యంలో న‌గ‌రంలో అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న వైద్య‌ - ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన దాదాపు 40 కాల‌నీల్లోకి నీరు చేరిపోయింది. ఇక వంద‌కుపైగా అపార్ట్ మెంట్ల సెల్లార్ ల‌లోకి వ‌ర‌ద నీరు చేరింది. ఈ అపార్ట్‌మెంట్ల లోని ప్ర‌జ‌లు పోలీసుల సాయంతో అతి కష్టం మీద బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

వర్షం కార‌ణంగా చాలా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు క‌నీసం నిత్యావ‌స‌రాలు చేర‌ని ప‌రిస్థితి నెల‌కొంది. క‌నీపం పాల ప్యాకెట్లు కూడా చేర‌వేయ‌లేని ప‌రిస్థితులు నెలకొన్నాయి. భారీ వ‌ర్షం త‌ప్ప‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించినా... ఆ దిశగా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించే విష‌యంలో జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ కాల‌నీలు వ‌ర్ష‌పు నీటిలో మునిగినా... త‌మ‌ను ఆదుకునేందుకు ప్ర‌జా ప్ర‌తినిధులు కాని, అధికారులు కాని ఇప్ప‌టిదాకా రాలేద‌ని కూడా కొన్ని కాల‌నీల వాసులు ఆరోపిస్తున్నారు.