Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీల‌కు మ‌ళ్లీ న‌ర‌కం క‌నిపించింది

By:  Tupaki Desk   |   2 Oct 2017 4:10 PM GMT
హైద‌రాబాదీల‌కు మ‌ళ్లీ న‌ర‌కం క‌నిపించింది
X
హైద‌రాబాదీల‌కు మ‌రోమారు హైద‌రాబాద్ క‌ష్టాలు తెలిసివ‌చ్చాయి. ఉరుములు...మెరుపులతో కూడిన ఏకదాటిగా వాన....హైదరాబాద్‌ ను ముంచెత్తింది. ఒకే తీరుగా దంచికొట్టడంతో కుండపోత వానకు నగరం తడిసి ముద్దెంది. కనీసం రెండు గంటల నుంచి భారీ వర్షం పడటంతో న‌గ‌రంలోని కీలక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని చిన్న చిన్న నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్ల మీద కూడా మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది.

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో చాలా మంది ఆఫీసుల్లోనే ఉండిపోయారు. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ - పంజాగుట్ట - ఉప్పల్ - మల్కాజ్‌ గిరీ ఏరియాల్లో భారీ స్థాయిలో వర్షం నమోదు అయ్యింది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు - పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. జంట నగరాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాతే ఉద్యోగస్తులు తమ కార్యాలయాల నుంచి తమ నివాసాలకు వెళ్లాలని సూచించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు - పాదాచారులు చాలా జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు నగర పోలీసులు. ప్రజలు బయటకు రాకుండా.. ఇండ్లలోనే ఉండి నగర పోలీసులకు సహకరించాలని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. కాగా, కీల‌క‌మైన ప్ర‌భుత్వ కార్యాల‌యాలు సైతం నీట మునిగాయి. జీహెచ్ ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో సైతం నీరు చేరింది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వ‌ద్ద భారీగా నీరు చేరింది. బేగంపేట‌ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వ‌ద్ద సైతం నీరు నిలిచింది.

నీరు నిలిచే ప్రాంతాలు..

రాణిగంజ్ బాంబే హోటల్ - వోల్గా హోటల్ దరుసలామ్ - మలక్‌ పేట పోలీస్ స్టేషన్ - కర్బాలా మైదాన్ జంక్షన్ - బషీర్‌ బాగ్ బహార్ కేఫ్ హోటల్ - మెడిసిటీ హాస్పటల్ - తెలుగు తల్లి ఫ్లై ఓవర్ - హిమాయత్‌ నగర్ స్ట్రీట్ నెంబర్ 19 - స్ట్రీట్ నెంబర్ 5 - మలక్‌ పేట్ గంజ్ - మలక్‌ పేట బజాబ్ ఎలక్ట్రికల్ - బీవీబీ జంక్షన్ - సీఎం క్యాంప్ ఆఫీస్ - లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ - క్రోమా - జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 - పుత్లిబౌలి - కేసీపీ జంక్షన్ - పంజాగుట్ట జంక్షన్ - గుల్జార్ హౌజ్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.