Begin typing your search above and press return to search.

సురక్షిత ప్రాంతాలకు హైదరాబాద్ ప్రజలు!!

By:  Tupaki Desk   |   21 Sep 2016 5:20 AM GMT
సురక్షిత ప్రాంతాలకు హైదరాబాద్ ప్రజలు!!
X

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, దాని ఫలితాలు ఒకెత్తు అయితే... భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాలు, ఫలితంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులూ ఒకెత్తు!! హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాల గురించే ఇప్పటివరకూ తెలుసు కానీ.. తాజాగా హుస్సేన్ సాగర్ రూపంలో మరో భారీ కష్టం పలకరించనుంది. అవును... హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హుస్సేన్ సాగర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. ఈ విషయాలు తాజాగ భాగ్యనగర వాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ పరిశరాల్లోని లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్ - ఇందిరా పార్క్ - అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈక్రమంలో మరో గంటపాటు ఏకదాటిగా భారీ వర్షం కురిస్తే మాత్రం సాగర్ మరింత ప్రమాదకరంగా మారుతుందని సమాచారం!

ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు హుస్సేన్ సాగర్‌ లోకి వస్తుండగా, పదిహేనువందల క్యూసెక్కుల నీటిని బయటకి విడుదల చేస్తున్నారు. అయినా కూడా హుస్సేన్ సాగర్ పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు... ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. కాగా ఇప్పటికే పలుప్రాంతాల్లో అపార్ట్‌ మెంట్ల సెల్లార్‌ లు నీటితో నిండిపోయాయి. రోడ్ల విషయానికొస్తే... ప్రాంతాలతో ప్రమేయం లేకుండా భాగ్యనగర రోడ్లు మొత్తం కాల్వలను తలపిస్తున్నాయి.