Begin typing your search above and press return to search.

48 గంట‌లు గ‌డిస్తే కానీ ఏమీ చెప్ప‌లేరంట‌

By:  Tupaki Desk   |   2 Dec 2015 1:04 PM GMT
48 గంట‌లు గ‌డిస్తే కానీ ఏమీ చెప్ప‌లేరంట‌
X
అదే ప‌నిగా కురుస్తున్న వాన‌కు చెన్నై ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. నెల‌ల పాటు కురిసే వ‌ర్షం కేవ‌లం రోజుల వ్య‌వ‌ధిలో కుర‌వ‌టం.. అది కూడా గంట‌ల వ్య‌వ‌ధిలో భారీగా కురిసిన వాన‌తో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్న ప‌రిస్థితి. గ‌త కొద్దిరోజులుగా కురిసిన వ‌ర్షం ఒక ఎత్తు అయితే.. మంగ‌ళ‌వారం కురిసిన భారీ వ‌ర్షం మ‌రొక ఎత్తు. చెన్నై మ‌హాన‌గ‌రంలో దాదాపుగా 40 ల‌క్ష‌ల మంది ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రాలేకుండా ఉన్నార‌ని చెబుతున్నారు. ఇంత‌లా ప్ర‌భావితం చేసిన వ‌ర్షాల సంగ‌తి ఒక‌టైతే.. రానున్న రెండు రోజుల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇప్ప‌టికే కురిసిన వ‌ర్షంతో జ‌న‌జీవితం అస్త‌వ్య‌స్త‌మైంది. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు వ‌ర్షం ఒక పెద్ద అడ్డంకి మార‌టం.. వాన‌నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవ‌టంతో స‌హాయ‌చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా మారింది. ఇక‌.. వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా ప్ర‌కారం రానున్న 48 గంట‌లు గ‌డిస్తే త‌ప్ప తాము ఏమీ చెప్ప‌లేమ‌ని అంటున్నారు. రానున్న రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని.. అది కూడా 50 సెంటీమీట‌ర్ల మేర వ‌ర్షం కురిసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న మాట‌లు భ‌య‌పెడుతున్నాయి.

రెండు రోజుల పాటు వ‌ర్ష‌మే ప‌డితే.. ఇప్ప‌టికే వ‌ర్షాల‌కు తీవ్ర ఇక్క‌ట్ల‌కు గురి అవుతున్న వారి ప‌రిస్థితేమిటి? ఇన్ని రోజుల పాటు స‌హాయ‌క చ‌ర్య‌లు ఆగిపోతే జ‌రిగే న‌ష్టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. రానున్న 48 గంట‌లు భారీగా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని.. ఆ త‌ర్వాత మ‌రో నాలుగైదు రోజులు ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కుర‌వొచ్చ‌ని చెబుతున్నారు. ఒక‌విధంగా చెప్పాలంటే రానున్న 48 గంట‌లే చెన్నై మ‌హాన‌గ‌రి భ‌విత‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెప్పొచ్చు.