Begin typing your search above and press return to search.

నెల్లూరు కాదది.. నీళ్లూరుగా మారిందే

By:  Tupaki Desk   |   20 Nov 2015 4:33 AM GMT
నెల్లూరు కాదది.. నీళ్లూరుగా మారిందే
X
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో కొన్ని జిల్లాలు తీవ్రప్రభావితం అయ్యాయి. నెల్లూరు జిల్లా కాస్తా ఇప్పుడు నీళ్లూరు జిల్లాగా మారిపోయిన పరిస్థితి. గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయలు అయ్యారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలోచిక్కుకుపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి. గురువారం నాటికి వర్ష ప్రభావం తగ్గినప్పటికీ వరద నీరు నిలిచిపోవటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిపోయింది.

పలు కాలనీలు వరదనీటిలో ఉండిపోయాయి. వర్షం కారణంగా జాతీయ రహదారికి భారీగా గండ్లు ఏర్పడటంతో వాటిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు 60 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోవటం గమనార్హం. గ్రామస్థులకు హెలికాఫ్టర్ ద్వారా ఆహారపొట్లాలను అంద చేస్తున్నారు. మరికొందరికి బోట్ల ద్వారా ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు. వర్షం బాధితులకు మరింత మెరుగైన సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షం జోరు గురువారం కాస్త తగ్గినా.. రాత్రి నుంచి మళ్లీ వానజోరు మొదలైంది. తాజాగా కురుస్తున్న వానలతో చిత్తూరు.. నెల్లూరు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇక.. చైన్నైలో పరిస్థితి దారుణంగా ఉంది. నెల్లూరు జిల్లా నీళ్లూరు జిల్లాగా మారిపోతే.. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఇక.. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ 180 మంది మృత్యువాత పడినట్లుగా అంచనా. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇంత భారీ స్థాయిలో మరణించటం ఇదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.