Begin typing your search above and press return to search.

ఏపీలో వ‌ర్షం తాట తీస్తుందండోయ్‌

By:  Tupaki Desk   |   18 May 2016 10:23 AM GMT
ఏపీలో వ‌ర్షం తాట తీస్తుందండోయ్‌
X
రోక‌ళ్లు సైతం ప‌గిలిపోవాల్సిన రోహిణికార్తె మండుటెండ‌ల్లో మ‌రో ములుపు. నిన్న‌టివ‌ర‌కూ నిప్పులు కురిపించిన భానుడ్ని మేఘాలు క‌మ్మేశాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం.. వాయుగుండంగా మారి తుఫానుగా మారుతున్న క్ర‌మంలో ముసురుకున్న మేఘాల ధాటికి భానుడు చిన్న‌బోయాడు. చెన్నై చుట్టూ అలుముకున్న భారీ మేఘాలు.. ఇప్పుడు ఏపీ మొత్తంగా విస్త‌రించాయి.

దీంతో..ఎండ‌లు మండాల్సిన వేళ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వ‌ర్షాలు ఏపీలోని ఒక‌ట్రెండు జిల్లాలకు ప‌రిమితం కాక‌.. దాదాపు ప‌ది జిల్లాల‌కు పైనే వ‌ర్షాల‌తో త‌డిచి ముద్ద‌వుతున్న ప‌రిస్థితి. భారీగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప‌లు జిల్లాల్లో ప‌ది సెంటీమీట‌ర్ల‌కు పైనే వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంది.

ఏపీలో కురుస్తున్న వ‌ర్షాల తీవ్ర‌త తెలిపే రెండు అంశాల్ని చెప్పాల్సి వ‌స్తే.. ఒక‌టి.. వ‌ర్షాల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు స్పందించారు. వాయు గుండం కార‌ణంగా రానున్న 24 గంట‌ల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని.. అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. ఇక‌.. తిరుమ‌ల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షం కార‌ణంగా శ్రీవారి ఆల‌యంలోకి వ‌ర్షం నీళ్లు చేరాయి. దీంతో.. మోటార్ల సాయంతో వ‌ర్ష‌పు నీటిని తోడుతున్న ప‌రిస్థితి. ఈ ఉద‌యం నుంచి తిరుమ‌ల‌లో దాదాపు పది సెంటీమీట‌ర్ల వ‌ర‌కూ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తెలుస్తోంది.

చిత్తూరు..క‌డ‌ప‌.. నెల్లూరు.. ప్ర‌కాశం.. గుంటూరు.. కృష్ణా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు.. విశాఖ‌.. విజ‌య‌న‌గ‌రం.. శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు న‌మోదవుతున్నాయి. వేళ కాని వేళ‌లో కురుస్తున్న ఈ భారీ వ‌ర్షాల కారణంగా పండ్ల తోట రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. వాయుగుండం కార‌ణంగా భారీ వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మండించే ఎంట మంట‌లు పోయి.. వ‌ణికించే వాన‌లు మొద‌ల‌య్యాయ‌న్న మాట‌.