Begin typing your search above and press return to search.

తీరం దాటింది కానీ తాట తీసింది

By:  Tupaki Desk   |   10 Nov 2015 5:45 AM GMT
తీరం దాటింది కానీ తాట తీసింది
X
నిన్నమొన్నటి వరకూ సరైన వర్షాలు లేక కిందామీదా పడిపోతున్న పరిస్థితి. అయితే.. వాయుగుండం రూపంలో వచ్చిన వర్షాలు రెండు రాష్ట్రాలతో పాటు.. ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని తడిచి ముద్ద చేశాయి. మొన్నటివరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే.. వాయుగుండ ప్రభావంతో కురిసిన వర్షాలతో మరో రకమైన కష్టాలు మొదలయ్యాయి. నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి.. ఆపై వాయుగుండమైంది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. పుదుచ్చేరి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చెన్నైలో సోమవారం అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కడలేరులో 14.. పుదుచ్చేరిలో 13 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. ఇక.. ఆంధ్రప్రదేశ్ లోనే వర్షాలు భారీగా కురిశాయి. సోమవారం రోజు తిరుమలలో 12 సెంటీమీటర్లు.. సత్యవేడులో 8 సెంటీమీటర్లు.. పుత్తూరు.. కోడూరు.. శ్రీకాళహస్తిలో 7.. నగరి.. పాకాల.. తొట్టంబేడు.. ఉదయగిరి.. తడ..సూళ్లూరుపేటలలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

వాయుగుండం కారణంగా చిత్తూరు.. నెల్లూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ముందుగా ఊహించిన విధంగానే ఈ వాయుగుండం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.ఈ వాయుగుండం మరింత తీవ్రమై.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు అప్రమత్తమై.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని తరలించటం.. మత్స్యకారుల్ని సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరించటం లాంటివి చేశారు.

వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలు తాగునీటి కొరతను తీర్చనున్నాయి. అయితే.. స్వల్ప వ్యవధిలో భారీగా వర్షాలు కురవటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సోమవారం మొత్తం తిరుమల కొండ మీద భారీగా వర్షం కురుస్తుండటంతో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలు రెండు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేసింది.