Begin typing your search above and press return to search.

రోజులో అక్కడ పడిన వర్షం హైదరాబాద్ లో పడితేనా? అడ్రస్ ఉండేది కాదేమో?

By:  Tupaki Desk   |   10 Aug 2019 4:45 AM GMT
రోజులో అక్కడ పడిన వర్షం హైదరాబాద్ లో పడితేనా? అడ్రస్ ఉండేది కాదేమో?
X
ఒక రోజు.. అంటే 24 గంటలు. ఈ వ్యవధిలో ఒక చోట పడిన వర్షం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కలలో కూడా ఊహించని రీతిలో పడిన ఈ వర్షం లెక్క వింటే నోటి వెంట మాట రాదు కదా.. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందన్న ఆలోచనే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. ఎందుకంటే.. 24 గంటల వ్యవధిలో పడిన వర్షం ఎంతో తెలుసా? అక్షరాల 91.1 సెంటీమీటర్లు (నిజంగానే సుమా).

ఇంతకీ ఇంత భారీ వర్షం కురిసింది ఎక్కడంటే.. తమిళనాడులోని నీలగిరి జిల్లా అవలాంజిలో ఈ భారీ వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిన రీతిలో కురిసిన ఈ వానతో కొత్త రికార్డు నమోదైంది. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షం పడటం షాకింగ్ గా మారింది. దక్షిణ భారతదేశంలో రోజు వ్యవధిలో ఇంత వర్షం పడటం రికార్డుగా చెబుతున్నారు.

కుండపోతను తలపించే రీతిలో కురిసిన వానతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదే తీరుగా కురిసిన వానతో ఉక్కిరిబిక్కిరి కావటంతో బయటకు రాలేని పరిస్థితినెలకొంది. ఇంతభారీ వర్షం కురిసిన నేపథ్యంలో విద్యుత్ ఉంటుందని అనుకోలేం కదా. అవలాంజిలో కురిసిన వర్షం హైదరాబాద్ మహానగరంలో కురిస్తే పరిస్థితి ఏమిటన్న ఊహే వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే రోజులో ఏడెనిమిది సెంటీ మీటర్ల వర్షపాతానికే రోడ్లు మొత్తం తటాకాల్లా మారిపోయి.. లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయే పరిస్థితి. అలాంటిది 24 గంటల వ్యవధిలో 91.1 సెంటీమీటర్ల వర్షమే కానీ హైదరాబాద్ మహానగరంలో కురిస్తే.. దాదాపుగా నగరంలోని ముప్పాతిక ప్రాంతం నీళ్లలో ఉండిపోవటం ఖాయం. మా మాటలేముంది? ఒక్కసారి ఊహించుకోండి?