Begin typing your search above and press return to search.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

By:  Tupaki Desk   |   18 Nov 2021 11:30 AM GMT
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X
తమిళనాడులో ఇటీవల భారీ వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం చూస్తుంటే ఏపీకి అలాంటి గండం పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అండమాన్‌ నికోబార్‌ తీరం దగ్గర ఏర్పడ్డ వాయుగుండం ఇవాళ, రేపట్లో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉంది.

ఇది కోస్తాంధ్ర, తమిళనాడు తీరానికి చేరుకునే సమయానికి మరింత పలబడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం కాస్తా తుఫానుగా మారితే క్రమంగా బలపడి ఈ నెల18 నాటికి తీరానికి చేరే అవకాశం ఉంది. జవాద్‌ తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మరీముఖ్యంగా రాబోయే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు... ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వాయుగుండం గా మారిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు.భారీ వ‌ర్షాల‌తో తిరుప‌తి న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు మ‌రోసారి జ‌ల‌మ‌యం అవుతున్నాయి. రోడ్ల‌పై నీళ్లు పారుతుండ‌డంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌డానికి వీల్లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉండ‌గా భారీ వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ వ‌ర్షం వ‌ల్ల ప్ర‌జానీకానికి ఇబ్బంది త‌లెత్త‌కుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

రెవెన్యూ, పోలీసుశాఖ‌లు ఎప్ప‌టిక‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, ఇత‌ర నీటినరుల వద్ద ఎలాంటి ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకో వాల‌ని సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

తిరుమలలో కూడా భారీ వర్షం కురవడంతో వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏడుకొండలపైకి నడకమార్గంలో వెళ్లే దారి వర్షపునీటితో వాగును తలపించింది. అలాగే వర్షదాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఇక ఈ వర్షాలు, ఈదురుగాలుల దాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునగడం, ధాన్యం తడిసిపోవడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వర్షాల దాటికి ఇళ్లలోకి కూడా నీరుచేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఈ వర్షభీభత్సాన్ని మరిచిపోకముందే మరో వాయుగుండం ఏపీపై విరుచుకుపడేందుకు సిద్దమైంది.