Begin typing your search above and press return to search.

ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి

By:  Tupaki Desk   |   18 July 2021 11:00 AM GMT
ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి
X
దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. ఈ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో భారీ వర్షాలు వరదల వల్ల వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి చెందడం విషాదం నింపింది.

విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్స్ పై నీరు నిలిచిపోవడంతో పలు లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ముంబైలోని ప్రముఖ ప్రాంతాల్లో, గాంధీ మార్కెట్ ఏరియాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. ఇక షణ్ముక్ నందా రోడ్డుసైతం మునిగిపోయింది.

సియాన్ రైల్వేస్టేషన్ మొత్తం వరద ఉధృతిలో చిక్కుకుపోయింది. వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముంబైలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు రహదారులపై నిలవడంతో హైవేలపై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో ఆదివారం మహుల్ ప్రాంతంలో గోడ కూలిపోయి కొందరు.. కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడడంతో మరికొందరు.. కాంపౌండ్ గోడకూలి మొత్తం 15మంది మరణించారు.

ఇక మహారాష్ట్రను వానలు వదిలేలా లేవు. ముంబై, ఠానేతోసహా పలు జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ముంబై సముద్ర తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఏజెన్సీలు, రెస్క్యూ టీం అందుబాటులో ఉండాలని సీఎం ఉద్దవ్ ఆదేశాలు జారీ చేశారు.

ముంబైలోనీ నీటిసరఫరా ఆగిపోయింది. వీటిని యుద్ధప్రాతిపదికన పునరుద్దరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాగునీటిని వేడి చేసి తాగాలని నగరవాసులకు ప్రభుత్వం సూచించింది.