Begin typing your search above and press return to search.

అర‌గంట వాన‌కు హైద‌రాబాద్ అత‌లాకుత‌లం!

By:  Tupaki Desk   |   18 May 2018 4:59 AM GMT
అర‌గంట వాన‌కు హైద‌రాబాద్ అత‌లాకుత‌లం!
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరు చెప్పినంత‌నే.. అంతంటారు.. ఇంతంటూ గొప్ప‌ల చిట్టాను విప్పేస్తుంటారు. ఆయ‌న్ను.. ఆయ‌న పాల‌న‌ను కీర్తించే విష‌యంలో పోటీ ప‌డిపోతుంటారు. మ‌రి.. అలాంటి గొప్పాయ‌న నాలుగేళ్లు పాలించి.. ఐదో ఏడాదిలోకి విజ‌య‌వంతంగా అడుగు పెడుతున్న వేళ‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అర‌గంట పాటు నాన్ స్టాప్ గా వ‌ర్షం ప‌డితే ఏం జ‌రుగుతుందో.. గురువారం సాయంత్రం మ‌హాన‌గ‌రంలో ఉన్న వారంద‌రికి అర్థ‌మైంది.

ఉమ్మ‌డి రాష్ట్రంలో సీమాంధ్ర పాల‌కులు హైద‌రాబాద్ ను స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. త‌మ హ‌యాంలో మ‌హాన‌గ‌రాన్ని ఎంత‌లా మారుస్తామో చూడండంటూ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది నెల‌ల‌కే గొప్ప‌లు చెప్పేశారు. ఆయ‌న‌లా చెప్పి నాలుగేళ్లు అయినా.. ప‌రిస్థితిలో కించిత్ మార్పు రావ‌టం త‌ర్వాత‌.. రోగం మ‌రింత ముదిరిపోయిన ప‌రిస్థితి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో కాసింత వాన ప‌డితే చాలు.. రోడ్ల మీద భారీ ఎత్తున నిలిచిపోయే వ‌ర్ష‌పు నీరు.. మ్యాన్ హోల్స్ లోకి వెళ్ల‌ని నీళ్లు.. ఆ కార‌ణంగా ఏర్ప‌డే ట్రాఫిక్ జాంలు.. ఇవి స‌రిపోన‌ట్లు చెట్లు కూలిపోవ‌టాలు.. లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర్ష‌పు నీటిలో తేలిపోవ‌టం.. హోర్డింగ్ లు ఊగిపోవ‌టం లాంటివి వ‌రుస‌గా జ‌రిగిపోతాయి.

తాజాగా కురిసిన అర‌గంట వ‌ర్షంతోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. గ‌తంతో పోలిస్తే.. ఇప్పుడు తీవ్ర‌త మ‌రింత పెరిగింది. వాట‌ర్ లైన్ కోసం.. అండ‌ర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల కోసం.. మెట్రో రైల్ కోసం.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో హైద‌రాబాద్ రోడ్ల‌ను ఎడాపెడా త‌వ్వేసిన ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు యంత్రాంగం పుణ్య‌మా అని.. న‌గ‌ర‌జీవుల‌కు చుక్క‌లు క‌నిపించాయి.

సాయంత్రం నాలుగు గంట‌ల‌కు సాయంత్రం ఆరున్న‌ర‌ గంట‌ల వేళలో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అలా చీక‌ట్లు క‌మ్మేశాయి. గాలి దుమారంతో న‌గ‌ర రోడ్ల మీద ప్ర‌యాణిస్తున్న వారికి చుక్క‌లుక‌నిపించాయి.

ఇక‌.. అర‌గంట పాటు దంచి కొట్టిన క్యుములో నింబ‌స్ మేఘం పుణ్య‌మా అని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌మంతా అత‌లాకుత‌ల‌మైన ప‌రిస్థితి. గంట‌లో చేరాల్సిన గ‌మ్యం.. వ‌ర్షం దెబ్బ‌కు రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ల‌క్ష‌లాది మంది న‌గ‌ర‌జీవులు వ‌ర్షం ప‌డిన ప్ర‌తిసారీ ఎలాంటి ప్ర‌యాస‌లు ప‌డ్డారో.. అవ‌న్నీ ప‌డ్డారు. అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నాం.. న‌గ‌రం మొత్తాన్ని అంత‌ర్జాతీయ న‌గ‌రిగా చేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసే అధికారులు.. వారిని న‌డిపించే రాజ‌కీయ బాస్ లు మాత్రం ఒక్క‌రంటే ఒక్క‌రు రోడ్ల మీద కానీ సోష‌ల్ మీడియాలోనూ చ‌ప్పుడు చేయ‌ని ప‌రిస్థితి. అంద‌రిని జ‌యించే కేసీఆర్ సార్.. వర్షం దెబ్బ‌కు కుదేలయ్యే హైద‌రాబాద్ స‌మ‌స్య‌ల మీద విజ‌యం సాధించ‌లేరా?