Begin typing your search above and press return to search.

చెన్నై వాసులకు ఇప్పుడు క్షణమొక యుగం

By:  Tupaki Desk   |   3 Dec 2015 9:20 AM GMT
చెన్నై వాసులకు ఇప్పుడు క్షణమొక యుగం
X
భారీగా కురిసిన వర్షాలతో చెన్నపురి కాస్తా తన్ని(నీళ్లు)పురిగా మారిన సంగతి తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలతో పాటు.. డ్రైనేజ్ సిస్టం సరిగా లేకపోవటంతో చెన్నై వాసులు తీవ్ర ఇక్కట్లు గురి అవుతున్నారు. లక్షలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత నాలుగు రోజులుగా నరకం చూస్తున్న చెన్నై వాసులకు.. అసలు కష్టమంతా రానున్న మూడు రోజులేనని చెబుతున్నారు.

గురువారం.. శుక్రవారం భారీగా వర్షాలు ఖాయమన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో పాటు.. ఆ తర్వాత మూడు రోజులు వర్షాలు ఖాయమని తేలుస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ముంచెత్తిన నీరు వెళ్లే మార్గం ఎలా అన్నది అర్థంకాకుంటే.. మరోవైపు భారీ వర్షాలు పడితే మరిన్ని సమస్యలు ఖాయం. ఇప్పటికే నాలుగు రోజులుగా కరెంటు లేని చెన్నై ప్రజల పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. కనీస అవసరాలకు సరిపడా నీళ్లు మొదలు.. ఆహారం వరకూ అన్ని సమస్యలుగానే మారుతున్నాయి. సాధారణ ప్రజల సమస్యలు ఒక ఎత్తు అయితే.. ఆసుపత్రిలో ఉండే రోగుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

వారికి సేవలు అందించే సిబ్బంది సమస్య.. ఆసుపత్రులు విద్యుత్తు లేకపోవటంతో డీజిల్ తో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ నిల్వలు తరిగిపోవటం.. ఆక్సిజన్ సిలిండర్ల లేకపోవటంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరో కష్టం చెన్నై వాసుల్ని ఇబ్బంది పెడుతోంది. భారీ వర్షాలు పడటం మొదలైంది నవంబరు 30. నెలాఖరు కావటంతో చాలా ఇళ్లల్లో వస్తువులు నిండికున్న పరిస్థితి.

జీతాలు వచ్చిన వెంటనే నెలసరి సామాను తెచ్చుకునే వీలుగా అందరూ ప్లాన్ చేసుకోవటం.. ఇప్పుడేమో నాలుగు రోజలుగా బయటకే వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా షాపులు లేకపోవటంతో ఉన్న కొద్దిపాటి వస్తువుల్ని ఆచితూచి వాడుకోవాల్సిన దుస్థితి. ఇక.. జీతాలు పడిన కొందరు ఉద్యోగులు సెలవు రోజున వెళదామన్న ఉద్దేశంతో ఆగారు. ఆ ఆలోచనే ఇప్పుడు శాపంగా మారింది. జేబులో డబ్బులున్నా.. తినేందుకు తిండి లేకపోవటం ఒక పెద్ద సమస్యగా మారింది.

బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా.. తీసుకునేందుకు ఏటీఎంలు లేకపోవటం.. నిత్యవసర వస్తువుల కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వయసు మళ్లిన వారు.. చంటిపిల్లలు ఉన్న ఇళ్ల పరిస్థితి అయితే వారి కష్టాలు చెప్పనలవి కాని రీతిలో తయారయ్యాయి. మరోవైపు.. వర్షాల తాకిడి రానున్న మూడు రోజులు తప్పవని తేల్చటంతో.. చెన్నై వాసులకు క్షణం ఒక యుగంగా మారింది. వారి కష్టం పగోడికి కూడా వద్దనే చెప్పాలి.