Begin typing your search above and press return to search.

ప్రాణం తీసిన టీవీ యాడ్‌..!

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:32 AM GMT
ప్రాణం తీసిన టీవీ యాడ్‌..!
X
నిద్ర లేచింది మొద‌లు నీతులు చెప్పే వారిలో న్యూస్ ఛాన‌ళ్లు ముందుంటాయి. త‌మ‌కు త‌ప్ప మ‌రెవ‌రికీ సామాజిక బాధ్య‌త ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అనుక్ష‌ణం నీతులు బోధిస్తుంటుంది. మ‌రి.. అలాంటి ఛాన‌ల్ ఏమైనా మ‌డి క‌ట్టుకొని కూర్చుంటుందా? అంటే..లోతుల్లోకి వెళ్లి చూస్తే.. అన్ని బొక్క‌లే.

ఆ మాట‌కు వ‌స్తే.. ఆ ఒక్క ఛాన‌ల్ మాత్ర‌మే కాదు.. న్యూస్ ఛాన‌ళ్లు చాలావ‌ర‌కూ ఉద‌ర‌గొట్టే ప్ర‌క‌ట‌న‌ల్ని ఒక ధారావాహికంగా మాదిరి ప్రసారం చేస్తుంటాయి. న‌మ్మ‌కం క‌లిగేలా చెప్పే మాట‌లు.. నిపుణుల వాయిస్ ల‌తో అందంగా ప్ర‌మోట్ చేసే ప్ర‌క‌ట‌న‌ల్ని ఎయిర్ చేస్తుంటాయి. తాము ప్ర‌సారం చేసే యాడ్స్ లో విష‌యం ఎంత‌న్న‌ది పట్టించుకోకుండా కాసులు ఇస్తే చాలు.. ఎయిర్ టైం ఇచ్చేస్తామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వ్యాపార ధోర‌ణి తాజాగా ఒక నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది.

ఎత్తు పెర‌గాల‌నుకుంటున్నారా? బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా? ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారా.. ఫ‌లితం రాలేదా? అస్స‌లు ఫీల్ కావాల్సిన అవ‌స‌రం లేదు. మా మందుల్ని ఇలా వేసుకోండి.. అలా ఎత్తు పెర‌గండి.. ఇలా బ‌రువు త‌గ్గండంటూ ఉద‌ర‌గొట్టే ప్ర‌క‌ట‌న‌ల మ‌త్తులో ప‌డిపోయిన ఒక విద్యార్థి త‌న ప్రాణాల్ని తీసుకున్న విషాద ఉదంత‌మిది.

వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలోని బ‌స్వ‌న్న‌గడ్డ‌కు చెందిన గోరీబీ కుమారుడు ఖాజాన‌జీర్ అహ్మ‌ద్‌. ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన న‌జీర్ చ‌దువుకుంటూనే ఖాళీ టైంలో ప‌ని చేస్తుంటాడు. పొట్టిగా ఉన్నాన‌న్న ఆత్మ‌న్యూనత‌తో స‌త‌మ‌త‌మ‌య్యే అత‌డు టీవీల్లో వ‌చ్చిన యాడ్స్ కు ఆక‌ర్షితుడ‌య్యాడు. త‌మ ఉత్ప‌త్తుల్ని వాడితే ఎత్తు పెరిగిపోతారంటూ చెప్పిన మాట‌ల్ని న‌మ్మి.. నాలుగు నెల‌ల క్రితం ఆన్ లైన్ లో మందులు తెప్పించుకున్నాడు.

మూడు రోజులు వాడిన త‌ర్వాత వాంతులు.. విరేచ‌నాలు మొద‌ల‌య్యాయి. దీంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌తో వ‌న‌ప‌ర్తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేర్చారు. చికిత్స అనంత‌రం తాత్కాలికంగా ఉప‌శ‌మ‌నం క‌లిగినా కొన్ని రోజులుగా అదే ప‌రిస్థితి రావ‌టంతో అదే ఆసుప‌త్రిలో చూపించ‌టం మొద‌లు పెట్టారు. మందుల కార‌ణంగా ఇన్ఫెక్ష‌న్ తో ప‌రిస్థితి విష‌మించిన వైనాన్ని గుర్తించి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు తీసుకెళ్లాల‌ని చెప్పారు. వెంట‌నే అక్క‌డ‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మ‌ర‌ణించటంతో న‌జీర్ త‌ల్లి క‌న్నీరు మున్నీరు అవుతోంది. ఎత్తు పెర‌గాల‌న్న ఆశ‌తో టీవీలో వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల్ని చూసి త‌న కొడుకు ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడ‌ని వాపోతోంది. టీవీ ప్ర‌క‌ట‌న‌ల్లో వ‌చ్చే అన్ని ఉత్ప‌త్తులు ఇలాంటివే కాక‌పోవ‌చ్చు. కానీ.. చూసినంత‌నే కొనేయ‌కుండా.. వాటి బాగోగులు చెక్ చేసుకున్నాక మాత్ర‌మే వాడాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.