Begin typing your search above and press return to search.

మిస్టరీగా మారిన హెలికాప్టర్ ప్రమాదం

By:  Tupaki Desk   |   11 Dec 2021 12:01 PM IST
మిస్టరీగా మారిన హెలికాప్టర్ ప్రమాదం
X
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణించిన హెలికాప్టర్ కు జరిగిన ప్రమాదం మిస్టరీగా మారుతోంది. దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమని ముందుగా అందరు అనుకున్నా ఇపుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆ అనుమానాలు ఏమిటంటే నీలగిరి కొండలు, అడవులున్న, లోయలున్న ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయట. మంగళవారమంతా కురిసిన భారీ వర్షాల వల్ల కొండలు, లోయంతా దట్టమైన పొగమంచుతో కప్పేసిందట.

ప్రమాదం జరిగిన బుధవారం ఉదయం కూడా వర్షం కురిసిందట. అంతటి పొగమంచున్నపుడు హెలికాప్టర్లో ప్రయాణించటానికి ఎవరినీ అనుమతించరు. కానీ బిపిన్ రావత్+భార్య+12 మంది ఉన్నతాధికారులు బయలుదేరటమే విచిత్రంగా ఉంది.

మామూలు హెలికాప్టర్ అంటే ప్రయాణం చేయటం కష్టమే కానీ ఎంఐ-17వీ5 సాధారణ హెలికాప్టర్ కాదు. ప్రతికూల వాతావరణంలో కూడా సులభంగా ప్రయాణం చేయగలిగిన సామర్ధ్యం బిపిన్ ప్రయాణం చేసిన హెలికాప్టర్ కుంది. ఆ ధైర్యంతోనే బిపిన్ హెలికాప్టర్లో బయలుదేరారు.

బిపిన్ ప్రయాణించిన హెలికాప్టర్ 6 వేల మీటర్ల ఎత్తులో అంటే 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకవేళ పొగమంచు దట్టంగా అలముకున్నా పొగమంచుకన్నా ఎత్తులో ప్రయాణించే అవకాశం ఈ హెలికాప్టర్ కుంది. మరి ప్రయాణ సమయంలో హెలికాప్టర్ ఎంత ఎత్తులో ప్రయాణించిందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

ఎందుకంటే ప్రమాదం జరిగే ముందే కంట్రోల్ టవర్ తో హెలికాప్టర్ కాంటాక్టు తెగిపోయింది. సూలూరు-వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీ మధ్య డిఫెన్స్ హెలికాప్టర్లు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తునే ఉంటాయి.

సో ఏరకంగా చూసుకున్నా పైలెట్లకు హెలికాప్టర్ నడపటం, వాతావరణం కొత్త కూడా కాదు. సూలూరు ప్రాంతంలోని కొండలు, లోయలు, అడవుల పై పైలెట్లకు పూర్తిస్ధాయి అవగాహన ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరలాంటపుడు ప్రమాదానికి కారణాలు ఏమిటనేది సస్పెన్సుగా మారిపోయింది. పొగమంచును అధిగమించే అవకాశాలు, అనుభవజ్ఞలైన పైలెట్లు, భౌగోళిక పరిస్ధితులపై పూర్తి సమాచారం ఉన్న పైలెట్లే హెలికాప్టర్లను నడిపినా ప్రమాదం జరగటమే ఆశ్చర్యంగా ఉంది.

అన్నింటికన్నా మించింది ఏమిటంటే ఈ హెలికాప్టర్ కు రెండు ఇంజన్లు చెడిపోయినా సేఫ్ గా భూమిపైన ల్యాండింగ్ చేసే సౌకర్యం కూడా ఉండదట. హెలికాప్టర్ ప్రయాణించాల్సిన సమయం కూడా కేవలం 25 నిముషాలు మాత్రమే.

మరి ఇంత తక్కువ సమయం ప్రయాణంలో, ఎలాంటి ప్రతికూల పరిస్ధితులను కూడా తట్టుకునే హెలికాప్టర్ కు ప్రమాదం జరిగి కుప్పకూలిపోయిందంటే ఏమి జరుగుంటుందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తం మీద నిపుణులు చెబుతున్నదేమంటే వాతావరణ ప్రభావం వల్ల ప్రమాదం జరిగుండదని. మరి దర్యాప్తులోనే అన్నీ విషయాలు బయటపడాలి.