Begin typing your search above and press return to search.

కేసీఆర్ త‌ర్వాత‌... ప‌రిపూర్ణానంద‌దే ఆ ఘ‌న‌త‌!

By:  Tupaki Desk   |   21 Nov 2018 8:53 AM GMT
కేసీఆర్ త‌ర్వాత‌... ప‌రిపూర్ణానంద‌దే ఆ ఘ‌న‌త‌!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు ప్ర‌చారం హోరెత్తుతోంది. నిన్న‌టిదాకా కాస్తంత స్లోగా సాగిన ప్ర‌చారం... నామినేష‌న్ల ఘ‌ట్టం ముగియ‌డంతో ఆయా పార్టీలు త‌మ త‌మ స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను రంగంలోకి దించేస్తున్నాయి. అధికార పార్టీగా టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత‌ - ఆప‌ద్ధ‌ర్మ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఇప్పుడు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌కు తెర తీశారు. రోజుకు రెండు నుంచి మూడు బ‌హిరంగ స‌భ‌ల‌కు హాజ‌ర‌వుతున్న కేసీఆర్‌... ఆయా స‌భ‌ల్లో ఆయా ప్రాంతాల స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంతో పాటుగా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా నిలిచిన మ‌హాకూట‌మిపై విమ‌ర్శ‌లు సంధిస్తూ త‌న‌దైన స్టైల్లో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. మ‌హా కూట‌మిలోని పార్టీలు కూడా ప్ర‌చారాన్ని పీక్స్‌ కు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇంత జ‌రుగుతున్నా... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా తెలంగాణ‌లో ప్ర‌చారం మొద‌లెట్ట‌నే లేద‌నే చెప్పాలి. ప్ర‌చారం మాట అటు ప‌క్క‌న పెడితే... యావ‌త్తు తెలుగు జాతితో పాటుగా పొరుగు రాష్ట్రాలు కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టిదాకా బీజేపీకి సంబంధించిన వార్త‌లే వినిపించ‌డం లేదు. ఏపీలో ప‌రిస్థితి మ‌రీ అధ్వాన్నంగా ఉన్నా... బీజేపీకి తెలంగాణ‌లో కొన్ని ప్రాంతాల్లో అంతో ఇంతో బ‌ల‌ముంద‌నే చెప్పాలి. హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌తో పాటుగా కొన్ని సెల‌క్టివ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు ఉంది.

మ‌రి నామినేష‌న్ల గ‌డువు ముగిసినా కూడా బీజేపీ ఇంకా ప్ర‌చారం వైపు దృష్టి పెట్ట‌డం లేదేమిటా? అన్న కోణంలో జ‌న‌మంతా ఒకింత ఆస‌క్తిగానే చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌త్యేకించి బీజేపీకి అనుకూలంగా ఉన్న జ‌నం... ఇత‌ర పార్టీల ప్ర‌చార హోరును ప‌రిశీలిస్తూ... మ‌న నేత‌లెప్పుడు మొద‌లెడ‌తారా? అన్న దిశ‌గా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ త‌ర‌హా బీజేపీ ఫ్యాన్స్ కు తియ్య‌టి క‌బురు చెబుతూ ఇప్పుడు ఓ మంచి వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వార్తేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో హెలికాప్ట‌ర్ వినియోగిస్తున్న నేత‌గా ఒక్క కేసీఆర్ మాత్ర‌మే ఉన్నారు. కేసీఆర్ త‌ర్వాత హెలికాప్ట‌ర్ వినియోగించ‌నున్న నేత‌గా ఇటీవ‌లే బీజేపీలో చేరిన ప‌రిపూర్ణానంద స్వామి వార్త‌ల్లోకి ఎక్కనున్నారు. ప‌రిపూర్ణానంద హెలికాప్ట‌ర్ వినియోగానికి సంబందించిన వార్త‌లో ఏ మేర నిజ‌ముంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. కాస్త లేటు అయినా... ప్ర‌చారాన్ని హోరెత్తించాల్సిందేన‌న్న కోణంలో బీజేపీ ప‌క‌డ్బందీ ప్లాన్ ర‌చించింద‌ట‌.

ఈ ప్లాన్ ప్ర‌కారం... తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీకి ప‌రిపూర్ణానందే స్టార్ క్యాంపెయిన‌ర్‌. ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న సాగించేలా పార్టీ అధినాయ‌కత్వం ప‌క‌డ్బందీగా టూర్ షెడ్యూల్‌ ను ర‌చించింద‌ట‌. రోజుకు హీన‌ప‌క్షం మూడు బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌రిపూర్ణానంద ప్ర‌సంగిస్తార‌ట‌. కుదిరితే నాలుగు స‌భ‌ల్లోనూ ఆయ‌న పాల్గొనేలా పార్టీ కేడ‌ర్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయినా ఈ వార్త ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌మ స్టార్ క్యాంపెయిన‌ర్ ప‌రిపూర్ణానంద హెలికాప్ట‌ర్ వినియోగించేందుకు అనుమ‌తించాలంటూ పౌర విమాన‌యాన శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీజీసీఏ)కు బీజేపీ ద‌రఖాస్తు పెట్టుకుంద‌ట‌. మొత్తంగా 15 రోజుల పాటు హెలికాప్ట‌ర్ వినియోగానికి అనుమ‌తించాల‌ని కూడా ఆ ద‌ర‌ఖాస్తులో బీజేపీ కోరింద‌ట‌. ఈ లెక్క‌న రోజుకు హీన‌ప‌క్షం మూడు బ‌హిరంగ స‌భ‌ల‌ను ప‌రిపూర్ణానంద చుట్టేసినా... 15 రోజుల్లో ఏకంగా 45 స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తార‌న్న మాట‌. రోజుకు నాలుగు స‌భ‌లు అనుకుంటే... ప‌రిపూర్ణానంద ఏకంగా 60 స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తారు. మొత్తంగా కాస్తంత లేటైనా... బీజేపీ త‌న‌దైన స్టైల్లో ప్ర‌చారాన్ని హోరెత్తించ‌నుంద‌న్న మాట‌. అయినా ఇంత చేసినా... త‌న‌కున్న ఓటు బ్యాంకుతో పాటు ఇప్పుడు బీజేపీ నేత‌లు చెబుతున్న‌ డాంబికాల మేర ఓట్లు ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు ప‌డతాయా? అన్న‌ది చూడాలి.