Begin typing your search above and press return to search.

70 కోట్ల స్థ‌లం రెండు ల‌క్ష‌ల‌కే

By:  Tupaki Desk   |   16 April 2016 8:23 AM
70 కోట్ల స్థ‌లం రెండు ల‌క్ష‌ల‌కే
X
వ‌డ్డించేవాడు మ‌న‌వాడైతే ఏ మూల‌న కూర్చున్నా క‌డుపు నిండుతుంద‌నేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు. సేవ చేసేందుకు అంటూ ఉద్దేశించిన‌ రాజ‌కీయాలు ఇటీవ‌లి కాలంలో ఆప్తుల‌కు మేలు చేసేందుకు అవ‌కాశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో ప్ర‌జ‌ల ఆస్తుల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతున్నారంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక‌వేత్త‌లు, ప్ర‌తిప‌క్షాలు ఫైర్ అవుతున్నాయి. చిత్రంగా ఇది బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌ హేమామాలినిని మెహ‌ర్బానీ కోసం కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం.

రూ. 70 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన స్థలాన్ని అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తో క‌డు చీప్‌గా రూ. 1.75 లక్షలకే ఇవ్వడానికి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ సిద్ధ‌మైంది. హేమ‌మాలిని ఏర్పాటు చేయనున్న డ్యాన్స్ స్కూల్‌ కోసం అని చెప్తూ ఇందులో ప్ర‌జా ప్ర‌యోజ‌నం అనే ట్విస్ట్‌ ను జోడించారు. ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన‌ అంధేరిలో 2000 చదరపు మీటర్ల స్థలాన్ని అతి తక్కువ ధరకు హేమామాలినికి ఇచ్చేందుకు అది కూడా 1976నాటి మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనిపై విప‌క్షాలు మండిప‌డ‌టంతో పాల‌కులు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

1976 ఫిబ్రవరి 1న నిర్దేశించిన ఈ విధానం ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు 25శాతం ధరకే భూములు కేటాయించవచ్చునని నిబంధ‌న‌లు ఉన్నందున హేమామాలినికి స్థ‌లం ఇస్తున్న‌ట్లు చెప్తున్నారు. అయితే ఈ లెక్క‌న చూసిన ప్ర‌భుత్వానికి ద‌క్కాల్సింది 7ల‌క్ష‌లు. కానీ 25శాతం ధ‌ర మాత్ర‌మే తీసుకోవ‌డం ద్వారా 1.75ల‌క్ష‌ల‌కు హేమ‌మాలిని స్థ‌లం దార‌ద‌త్తం చేస్తున్నారు. కొస‌మెరుపు ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్‌ ధర ప్రకారం చూసి ఈ స్థలం విలువ కోట్ల రూపాయ‌ల్లో ఉంది. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం రూ. 23కోట్లు పలుకుతుందని చెప్తున్నారు. ఓపెన్ మార్కెట్‌ లో అయితే ఈజీగా 70 కోట్ల వరకు ధర పలికే అవకాశముందని చెప్తున్నారు.