Begin typing your search above and press return to search.

మీడియాకు మైండ్ బ్లాక్ చేసిన హేమ‌మాలిని

By:  Tupaki Desk   |   6 Aug 2017 4:45 PM GMT
మీడియాకు మైండ్ బ్లాక్ చేసిన హేమ‌మాలిని
X
దాదాపు 130 కోట్ల‌కు పైనే ఉన్న భార‌తీయుల త‌ల‌రాత‌ల్ని రాసేందుకు కాస్తా అటూ ఇటూగా 800 పైచిలుకు ఎంపీలు తెగ క‌ష్ట‌ప‌డిపోతుంటారు. పార్ల‌మెంటులోకి అడుగు పెట్టిన ప్ర‌తిఒక్క‌ళ్లు దేశ భ‌విత‌ను వెలిగిపోయేలా చేస్తాన‌ని చెప్పేటోళ్లే. కానీ.. మ‌న ఎంపీలకున్న తెలివి ఎంత‌న్న‌ది ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. మ‌నోళ్ల మేథ ఎంతో తెలిసిపోతుంది.

ముంద‌స్తుగా మాక్ పోలింగ్ నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసే స‌మ‌యానికి ప‌ద‌కొండు ఓట్లు చెల్ల‌కుండా పోయాయి. ఓట్లు ఎలా వేయాలో ట్రైనింగ్ ఇచ్చిన త‌ర్వాత కూడా చెల్ల‌కుండా పోయాయి అంటే మ‌న ప్ర‌జాప్ర‌తినిధులు తెలివి చూసి ముచ్చ‌ట ప‌డిపోవాల్సిందే.

ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఒక ఆస‌క్తిక‌ర అంశం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌కు పోటీగా విప‌క్షాలు బ‌రిలో దింపిన అభ్య‌ర్థి జాతిపిత గాంధీ మ‌హాత్ముడి మునిమ‌న‌మ‌డు గోపాల‌కృష్ణ గాంధీ. ఈ ఎన్నిక‌లకు ముందే ఆయ‌న సుప‌రిచితుడైనా.. ఇప్ప‌టి డిజిట‌ల్ జీవుల‌కు ఉప రాష్ట్రప‌తిఅభ్య‌ర్థిగా స‌రికొత్త‌గా చాలామందికి ప‌రిచ‌యం అయ్యారు. గ‌డిచిన కొద్దిరోజులుగా దిన‌ప‌త్రిక‌ల్లోనూ.. టీవీ ఛాన‌ళ్ల‌లోనూ ఆయ‌న ఫోటోలు బాగానే క‌నిపిస్తున్నాయి.

అలాంటి ఆయ‌న్ను గుర్తించ‌టం త‌ర్వాత‌.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటూ బీజేపీ ఎంపీ.. ప్ర‌ముఖ సినీ న‌టి హేమ‌మాలిని క్వ‌శ్చ‌న్ చేయ‌టం మీడియా ప్ర‌తినిధుల‌కు దిమ్మ తిరిగేలా చేసింది. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా ఓటు వేయ‌టానికి వ‌చ్చిన హేమ‌మాలిని మీడియా వాళ్లు ఫోటోలు తీసేందుకు హ‌డావుడి ప‌డ్డారు. వ‌య‌సు మీద ప‌డ్డా.. ఇప్ప‌టికీ వెలిగిపోయే హేమ‌ను ఫోటోల మీద ఫోటోలు తీస్తూ ఉండ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా సంద‌డిగా మారిపోయింది.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక్క‌డే అనుకోని పరిణామం చోటు చేసుకుంది. అలా ఫోటోల హ‌డావుడి జ‌రుగుతున్న వేళ‌.. అక్క‌డ‌కు ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి విప‌క్షాల అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన గోపాల‌కృష్ణ గాంధీ అక్క‌డ‌కు వ‌చ్చారు. దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ మూగిన మీడియా ఒక్క‌సారిగా ఆయ‌న వైపు వెళ్లి పోయింది. ఏ మాత్రం ప‌రిచ‌యం లేని ముఖానికి మీడియా ఇంత ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ఏమిట‌న్న ఆలోచ‌నో ఏమో కానీ.. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటూ మీడియాను క్వ‌శ్చ‌న్ చేశార‌ట హేమ‌.

విపక్షాల అభ్య‌ర్థి కూడా హేమ‌కు తెలీదా? అని ఒక్క క్ష‌ణం షాక్ తిన్నమీడియా ప్ర‌తినిధులు.. గోపాల‌కృష్ణ గాంధీ గురించి చెప్పారు. కాసేప‌టికి హేమ‌మాలిని చూసిన గోపాల కృష్ణ గాంధీ ఆమెను ప‌లుక‌రించారు. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా గుర్తు ప‌డ‌తారు అంటూ.. గోపాల‌కృష్ణ గాంధీ వ్యాఖ్యానిస్తూ త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్నార‌ట‌. ఓటు వేయ‌టానికి వ‌చ్చిన ఎంపీ హేమ‌కు.. విప‌క్షాల అభ్య‌ర్థి ఎవ‌రో కూడా తెలీదా? అంటూ మీడియా ప్ర‌తినిధులు ఒక్క‌సారి అవాక్కు అయిన ప‌రిస్థితి. దీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉంటున్న హేమ‌కున్న రాజ‌కీయ అవ‌గాహ‌న చూసిన‌ప్పుడు అమ్మ‌డి ప్ర‌జాసేవ ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.