Begin typing your search above and press return to search.

ఏం చేయాలో కాదు.. ఎలా చేయాలో చెప్పేస్తే బాగుండేది మోడీజీ

By:  Tupaki Desk   |   21 Feb 2021 7:30 AM GMT
ఏం చేయాలో కాదు.. ఎలా చేయాలో చెప్పేస్తే బాగుండేది మోడీజీ
X
ఏమేం చేయాలో అందరూ చెప్పేవాళ్లే. కానీ.. వాటిని ఎలా చేయాలి? అందుకు తాము ఏమేరకు దన్నుగా ఉంటామన్న విషయాన్ని మాత్రం చాలా కొద్దిమందే చెబుతారు. ప్రధాని నరేంద్రమోడీ మాటల్ని చూసినప్పుడు ఆయన మొదటి వర్గానికి చెందిన వారుగా చెప్పాలి. అదే పనిగా.. మాటలు చెప్పే బదులు.. కేంద్రం కొత్త విధానాల గురించి ప్రస్తావించి.. వాటి అమలుకు ప్రోత్సహాకాల్ని వివరిస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా? అందుకు బదులుగా మాటలకే మోడీ పరిమితం కావటం ఏమిటి?
తాజాగా నీతిఆయోగ్ ఆరో సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోడీ.. అందులో తన సూక్తుల సుద్దల స్పీచ్ ను ఇచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ మొత్తంగా ఏం చెప్పారన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ప్రైవేటుకు మరింతగా తలుపులు బార్లా తీద్దామన్న సందేశాన్ని ఇచ్చారు. దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు.. కేంద్రంతో సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రైవేటు రంగం ఎదుగుదలకు మరింత ఊతం ఇచ్చేలా ఉండాలన్నారు.

కరోనా విపత్తు వేళ.. కేంద్రం.. రాష్ట్రాలు సమన్వయంగా పని చేశాయని.. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. సహకార సమాఖ్య విధానంలోనే రాష్ట్రాలు.. జిల్లాల మధ్య పోటీని పెంచాలన్న ప్రతిపాదనను చేశాయి. ప్రైవేటు రంగానికి ఉత్సాహాన్ని.. శక్తిని ప్రభుత్వాలు గౌరవించి.. చేతనైనంత సహకారం అందించాలన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు వాటి ఉత్పత్తిని పెంచాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

కేవలం వంటనూనెల దిగుమతి కోసం రూ.65-70 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని.. మరి ఈ మొత్తం మన రైతులకు చెందాల్సిన సొమ్ముగా అభివర్ణించారు. కేంద్రం పలు రంగాలకు ఉత్పత్తి ఆధార ప్రోత్సాహాకాల్ని ప్రకటించిందని.. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా రాష్ట్రాలు పూర్తిస్థాయిలో వాడుకోవాలన్నారు. మోడీ నోటి నుంచి వచ్చిన మాటలన్ని రోటీన్ గా ఉండటమే తప్పించి.. వెనువెంటనే మార్పులు తెచ్చేందుకు అవసరమైన ప్రణాళిక ఏమీ కనిపించటం లేదన్న పెదవి విరుపు వినిపిస్తోంది. దీనికి మించి.. ఏమేం చేయటం ద్వారా.. వంట నూనెలతో పాటు.. మరికొన్ని అంశాలపై మోడీ విధానాల్ని స్పష్టంగా ప్రకటించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.