Begin typing your search above and press return to search.

ఈఎంఐలు మ‌రింత భారం.. ఆర్‌బీఐ తాజా చ‌ర్య‌లు ఇలా!

By:  Tupaki Desk   |   30 Sep 2022 8:11 AM GMT
ఈఎంఐలు మ‌రింత భారం.. ఆర్‌బీఐ తాజా చ‌ర్య‌లు ఇలా!
X
రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పెరుగుతున్న ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు కీల‌క వ‌డ్డీరేట్ల‌ను సెప్టెంబ‌ర్ 30న మ‌రోసారి పెంచింది. రెపోరేటు (బ్యాంకులు రిజ‌ర్వు బ్యాంక్ ద‌గ్గ‌ర తీసుకున్న రుణాల‌కు చెల్లించే వ‌డ్డీ రేటు)ను ఇప్పుడున్న 5.85 శాతానికి మ‌రో 0.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. దీంతో నెల‌స‌రి వాయిదాలు (ఈఎంఐలు) మ‌రింత భారం కానున్నాయి.

ఈ మేరకు సెప్టెంబ‌ర్‌ 28-29 తేదీల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ తాజాగా మీడియాకు తెలిపారు. మేలో 0.40 శాతం; జూన్‌, ఆగస్టులో 0.50 శాతం చొప్పున రెపో రేటును పెంచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 0.50 శాతం పెంచడంతో నాలుగు నెలల వ్యవధిలోనే రెపో రేటు 1.90 శాతం పెరిగిపోయింది.

దీంతో వినియోగ‌దారుల‌కు ఈఎంఐల భారం త‌డిసి మోపెడు కానుంది. బ్యాంకులు తాము తీసుకున్న రుణాల‌కు గానూ రిజ‌ర్వు బ్యాంకుకు చెల్లించే వ‌డ్డీ రేటు.. రెపో రేటును ఆర్‌బీఐ పెంచ‌డ‌మే ఇందుకు కార‌ణం. రిజ‌ర్వు బ్యాంక్ త‌మ‌పై మోపిన వ‌డ్డీ భారాన్ని బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల నెత్తిన వేస్తాయి. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల్లో వాహ‌న రుణాలు, గృహ రుణాలు, వ్య‌క్తిగ‌త రుణాలు, బంగారు రుణాలు తీసుకున్న‌వారికి ఇక ప్ర‌తినెలా చెల్లించే వాయిదా మొత్తం మ‌రింత పెర‌గ‌నుంది. అంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం.. ఇప్పుడు 8.5 శాతానికి మించే అవకాశాలున్నాయి. దీంతో ఆ మేర‌కు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం/రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది.

బ్యాంకు రుణం తీసుకుని.. కొత్తగా ఇల్లు కొనాలని అనుకునే వారికీ ఆర్‌బీఐ తాజా చ‌ర్య‌లే ఇబ్బందే అని చెబుతున్నారు. వినియోగ‌దారుల‌ ఆదాయానికి తగ్గట్లు ఇచ్చే రుణం మొత్తం తగ్గే అవ‌కాశం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మంటున్నారు. దీంతో వినియోగ‌దారులు త‌మ చేతి నుంచి అధికంగా మార్జిన్‌ మనీని చెల్లించాల్సి వస్తుంద‌ని పేర్కొంటున్నారు. దీంతో నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు.

కాగా మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. మళ్లీ ఆగస్టులో 7 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ సౌకర్యవంత సూచీగా పెట్టుకున్న 6 శాతానికి ఎగువన రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా ఇది ఎనిమిదో నెల కావడం గమనార్హం.

మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజురోజుకీ పతనమవుతోంది. వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఆర్‌బీఐ దీన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ అమెరిక‌న్ డాల‌ర్‌తో పోలిస్తే రూ.81.94కి దిగ‌జారింది. ప్రపంచ వ్యాప్తంగా మ‌రోమారు మ‌హా ఆర్థిక మాంద్యం రాబోతోందనే భయాల‌తో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల అమెరికాలో ఫెడ్ వడ్డీరేట్లు పెరగడంతో డాలర్‌ బలంగా మారింది. దీంతో ఇన్వెస్ట‌ర్లు త‌మ పెట్టుబడులను అమెరికా మళ్లిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని దేశాల కరెన్సీ విలువలు క్షీణిస్తున్నాయి.

కాగా ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ త‌న ప్ర‌సంగంలో భారత విదేశీ మారక నిల్వలు 537.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయ‌ని తెలిపారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించామ‌న్నారు. అలాగే ఈ ఏడాది ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బీఐ 6.7 శాతంగా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో 7.1 శాతం, మూడో త్రైమాసికంలో 6.5 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతం ఉంటుందని లెక్క‌గ‌ట్టింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.