Begin typing your search above and press return to search.

నారా భువనేశ్వరికి 'గోల్డెన్ పీకాక్' అవార్డు

By:  Tupaki Desk   |   18 Sep 2016 7:07 AM GMT
నారా భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డు
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోబోతున్నారు. అయితే.. అవార్డు ఆమెకు వ్యక్తిగతంగా వచ్చింది కాదు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు వరించిన ఆ అవార్డును సంస్థ ఎండీగా భువనేశ్వరి అందుకోబోతున్నారు.

చంద్రబాబు కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కు కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. వచ్చే నెలలో 17 నుంచి 20 వరకూ లండన్ లో 16వ 'లండన్ గ్లోబల్ కన్వెన్షన్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టెయినబిలిటీ' సదస్సులో ఈ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ తరఫున భువనేశ్వరి అందుకుంటారు. అవార్డును స్వీకరించేందుకు రావాలని సంస్థ ఎండీ - చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డుల కమిటీ సెక్రటేరియెట్ డైరెక్టర్ జనరల్ వివేక్ అగ్నిహోత్రి నుంచి ఇప్పటికే ఆహ్వానం అందింది.

కాగా ఈ అవార్డు ఎంపిక ప్రక్రియను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య ఆధ్వర్యంలోని భారత జ్యూరీ నిర్వహించింది. కార్పొరేట్ వ్యవహారాలు - వ్యాపార విస్తరణ - వినియోగదారుల సేవలు - సామాజిక బాధ్యత వంటి అన్నీ అంశాలూ చూసి హెరిటేజ్ ఫుడ్స్ ను అవార్డుకు ఎంపిక చేసింది. హెరిటేజ్ సంస్థ నుంచి పాలు - ఇతర డెయిరీ ఉత్పత్తులు ఉండడంతో పాటు పలు చోట్ల స్టోర్లు కూడా ఉన్నాయి. హుద్ హుద్ తుపాను సమయంలో ఉత్తరాంధ్రలో హెరిటేజ్ సంస్థ ప్రజలకు ఉచితంగా పాలు - పెరుగు వంటివి అందించింది. అలాగే పుష్కరాల సమయంలోనూ ఉచితంగా అందించింది.