Begin typing your search above and press return to search.

గోదావరి వ‌ర‌ద‌ల్లో హెరిటేజ్ ఔదార్యం!

By:  Tupaki Desk   |   18 July 2022 7:14 AM GMT
గోదావరి వ‌ర‌ద‌ల్లో హెరిటేజ్ ఔదార్యం!
X
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తోడు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌డుతున్న వాన‌లు, ఉప నదుల విజృంభ‌ణ‌తో గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహంతో విజృంభించిన సంగ‌తి తెలిసిందే. గ‌త 30 ఏళ్ల‌లో లేనంత వ‌ర‌ద ప్ర‌వాహం రావ‌డంతో రాష్ట్రంలో నాలుగు జిల్లాలు.. ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి, కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలు వ‌ర‌ద ప్ర‌వాహంలో చిక్కుకున్నాయి. న‌ర్సాపురం, రాజ‌మండ్రి, పాల‌కొల్లు, రాజోలు, కొత్త‌పేట‌, రావుల‌పాలెం నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌ర‌ద చుట్టేసింది. రాజ‌మండ్రి న‌గ‌రం లో కూడా లోతట్టు ప్రాంతాలు వ‌ర‌దల్లో చిక్కుకుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అపార్ట‌మెంట్ల‌పైకి, ఇళ్ల‌పైకి త‌మ వ‌స్తువుల‌ను చేరేసుకుని వస్తువులతో పాటు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మ‌రోవైపు మొత్తం న‌లువైపులా వ‌ర‌ద చుట్టేయ‌డంతో పాలు, ఆహార ప‌దార్థాలు తెచ్చుకోవ‌డం గ‌గ‌నంగా మారింది. ముఖ్యంగా రాజ‌మండ్రి లోని హుకుంపేట‌, సావిత్రి న‌గ‌ర్ లో గోదావ‌రి వ‌ర‌ద నీరు అపార్ట‌మెంట్ల‌ను చుట్టు ముట్టింది. సెల్లార్ ల‌లోకి సైతం వ‌ర‌ద నీరు చేరింది.

ఈ నేప‌థ్యంలో హెరిటేజ్ డెయిరీ.. వ‌ర‌ద నీటిలోనే పాలు, ఇత‌ర పాల ఉత్పత్తుల‌ను ఆయా అపార్టుమెంట్ల వ‌ద్ద‌కు వ‌చ్చి చేర‌ వేసింది. ప్ర‌జ‌లెవ‌రూ వ‌ర‌ద‌ల్లో కింద‌కు దిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో హెరిటేజ్ డెయిరీ సిబ్బందే బాస్కెట్ల‌లో పాల ప్యాకెట్లు తెచ్చి ప్ర‌జ‌ల‌కు అందించారు. ఇలా ప్ర‌తి ఇంటికీ, అపార్టుమెంటుకు తిరుగుతూ పాల ప్యాకెట్లు అందించారు. దీంతో ప్ర‌జ‌లు హెరిటేజ్ డెయిరీ సేవ‌ల ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు. వ‌ర‌ద ప‌రిస్థితుల్లో ముఖ్యంగా చిన్న పిల్ల‌లు పాల‌కు ఇబ్బంది ప‌డ‌కుండా హెరిటేజ్ డెయిరీ సిబ్బంది పాల ప్యాకెట్ల‌ను వ‌ర‌ద‌లో సైతం తెచ్చి ఔదార్యం చూపార‌ని కొనియాడారు. మిగతా డెయిరీలు ఏవీ వ‌ర‌ద‌ల్లో ముందుకు రాని ప‌రిస్థితుల్లో హెరిటేజ్ ఒక్క‌టే ప్ర‌తి ఇంటికీ పాలు తెచ్చివ్వ‌డం ముదావ‌హ‌మ‌ని ప్ర‌శంసించారు.

రాజ‌మండ్రిలోనే కాకుండా గ‌తంలో భారీ వ‌ర్షాల‌తో తిరుప‌తి న‌గ‌రం నీట మునిగిన‌ప్పుడు కూడా హెరిటేజ్ డెయిరీ సిబ్బంది ఇలాగే ప్ర‌తి ఇంటికీ వెళ్లి పాల ప్యాకెట్ల‌ను అందించారు. త‌ద్వారా తిరుప‌తి న‌గ‌ర ప్ర‌జ‌ల ప్ర‌శంస‌లు అందుకున్నారు.