Begin typing your search above and press return to search.

హీరో బన్ గయా మంత్రి.. త్వరలోనే కీలక పదవి

By:  Tupaki Desk   |   2 May 2022 9:00 AM GMT
హీరో బన్ గయా మంత్రి.. త్వరలోనే కీలక పదవి
X
తమిళనాడు యువ హీరో.. సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ కు త్వరలోనే ప్రమోషన్ లభించబోతోంది. తమిళనాడులో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఉదయనిధి కృషి చేశారు. పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఎనలేని సేవలు చేశారు. యువతను డీఎంకే వైపు మళ్లించడంలో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ ను క్యాబినెట్ లోకి తీసుకురావడానికి సీఎం స్టాలిన్ కసరత్తు చేస్తున్నట్టు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వార్తలు లీక్ అవుతున్నాయి.

ఉదయనిధి ఇప్పటికే ప్రజాదరణ పొందారు. చాలా మంది మంత్రులు తమ శాఖ కార్యక్రమాలకు ఉదయనిధిని పిలిచి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధిని మంత్రులతోపాటు సమంగా కూర్చుండబెడితే ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి. అందుకే వీటికి చెక్ పెట్టేలా ఉదయనిధిని కేబినెట్ లోకి తీసుకోవాలని.. మంత్రిని చేయాలని స్టాలిన్ నిర్ణయించినట్టు తెలిసింది. అప్పుడే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని డీఎంకే అధిష్టానం భావిస్తోంది.

చెపాక్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధిని డీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తారు. కేవలం సీఎం స్టాలిన్ కుమారుడు కాబట్టే ఆయనకు ఇంత గౌరవం అన్న విమర్శలు వినిపించినా వెనక్కి తగ్గడం లేదు. ఇక ఉదయనిధి ఎన్నికల్లో కృషి చేశారని.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

ఇప్పటికే డీఎంకే ప్రభుత్వంలో తొలిసారి గెలిచిన యువ ఎమ్మెల్యేలు నలుగురిని మంత్రులుగా చేశారు. కాబట్టి సీఎం కొడుకు, కీలక నేత ఉదయనిధిని మంత్రిని చేయడంలో తప్పులేదని అంటున్నారు.

ఇక డీఎంకేలో 1989లో పార్టీ యువజన విభాగం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా అందులోంచి ఒక్కరినైనా మంత్రిగా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి యువజన విభాగం నుంచి మంత్రులు ఎవరూ డీఎంకే కేబినెట్ లో లేరు. దీంతో ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వడం సరైందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయనిధికి 'యువజన సంక్షేమం.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ', ఐటీ లాంటి శాఖలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్ నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో ఉదయనిధి గెలిచాడు. రెండేళ్ల కిందటి నుంచే రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అంతకుముందు వరకూ సినిమాల్లో హీరోగా బిజిగా ఉన్నాడు. కొన్ని సినిమాలు చేశాడు. నిర్మాతగానూ సూర్య, కమల్ హాసన్, విజయ్ లతో సినిమాలు నిర్మించాడు. '2012'లో ఓకే ఓకే సినిమాతో ఉదయనిధి హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 9 ఏళ్లలో 13 సినిమాలు తీశాడు. కరుణానిధి మరణానంతరం తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. త్వరలోనే మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.