Begin typing your search above and press return to search.

బీజేపీని తరిమికొట్టమంటున్న శివాజీ

By:  Tupaki Desk   |   30 July 2016 9:58 AM GMT
బీజేపీని తరిమికొట్టమంటున్న శివాజీ
X
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఏపీ విభజన నాటి నుంచి ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై నిజాయితీగా గళం విప్పుతూ.. ఎప్పటికప్పుడు తన ఆవేదనను.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది సినీ హీరో శివాజీ అని మాత్రమేనని చెప్పక తప్పదు. కాకుంటే.. అతడికి అంత ఫ్యాన్ మొయిల్ లేకపోవటం.. అతడికి మీడియా సపోర్ట్ అంతంత మాత్రం కావటంతో అతను పెద్దగా ఫోకస్ కాలేదని చెప్పాలి. ప్రముఖ మీడియా సంస్థల్లో అతగాడి వాదనను వినిపించే సంస్థలు చాలా తక్కువే. దీంతో.. అతగాడి ఆవేదన అంతా అరణ్యరోదనగా మారే పరిస్థితి. తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అనుక్షణం ఆరాటపడే శివాజీ తాజాగా మరోసారి గళం విప్పారు.

రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ సందర్భంగా జైట్లీ సమాధానంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీని తరిమికొట్టాలని పిలుపు ఇచ్చిన ఆయన.. బీజేపీ పేరు వినిపిస్తే చాలు తరిమికొట్టాలన్నారు. అన్నగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని.. ఆయనపై టీడీపీ నేతలకు ఏ మాత్రం గౌరవం ఉన్నా బీజేపీ సర్కారు నుంచి బయటకు రావాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవటంలో సుజనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివాజీ.. ఛంద్రబాబు ఏ ఉద్దేశంతో సుజనా చౌదరిని కేంద్రానికి పంపారని ప్రశ్నించారు. బ్యాంకు స్కామ్ ల సుజనా చౌదరి బీజేపీకి వత్తాసు పలికి ఏపీకి ద్రోహం చేస్తున్నారన్నారు. సుజనాతో పాటు మరో ఇద్దరు తెలుగోళ్లు ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. సుజనా నుంచి వచ్చే ఒత్తిడికి లొంగకుండా కేంద్రం నుంచి బయటకు వచ్చే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోవాలన్నారు.

తాజాగా తీరుతో బీజేపీ నైజం ఏమిటో తెలిసిపోయిందని.. కేంద్రంలో మోడీ సర్కారు నుంచి టీడీపీ బయటకు వచ్చేయాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు కంటే బీజేపీ మహా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న శివాజీ.. బీజేపీ పేరు వినపడితే చాలు తరిమి కొట్టాలన్నారు. ‘‘బీజేపీ పేరు వినిపిస్తే చాలు తరిమికొట్టండి. అప్పుడైనా వారికి బుద్ధి వస్తుంది. ప్రత్యేక హోదా మన హక్కు. సాధించే వరకూ ఏ తెలుగోడు కూడా ఊరుకోకూడదు’’ అని వ్యాఖ్యానించారు. నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని వ్యాఖ్యానించిన వెంకయ్య ఈ రోజు నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించిన శివాజీ.. వెంకయ్య తీరును తీవ్రంగా తప్పు పట్టారు.