Begin typing your search above and press return to search.

మోదీ త‌లాక్!...ఇది శివాజీ కొత్త చ‌ట్టం!

By:  Tupaki Desk   |   12 Feb 2019 10:39 AM GMT
మోదీ త‌లాక్!...ఇది శివాజీ కొత్త చ‌ట్టం!
X
గ‌రుడ పురాణం వినిపించిన సినీ న‌టుడు శివాజీకి ఇప్పుడు కొత్త ఉత్సాహం వ‌చ్చింది. గ‌తంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఓ మోస్త‌రులో పోరాటం చేసిన శివాజీ... ఏకంగా నిరాహార దీక్ష‌కు కూడా దిగారు. టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడి పైనే ఆయ‌న పోరాటం చేశారు. అయితే గ‌తంలో ప్ర‌త్యేక హోదా అంటే జైల్లో వేస్తాన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసి ఇప్పుడు యూటర్న్ తీసుక‌న్న చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో పోరాటం చేస్తుంటే... శివాజీ కూడా ఆయ‌న వెన్నంటే న‌డుస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నిన్న ఢిల్లీ వేదిక‌గా 12 గంట‌ల దీక్ష చేసిన చంద్ర‌బాబు శిబిరంలో శివాజీ కూడా త‌న‌దైన శైలిలో ప్ర‌సంగం దంచి ప‌డేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ల‌క్ష్యంగా చేసుకుని శివాజీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆసక్తి క‌రంగా మారిపోయాయి.

త్రిపుల్ త‌లాక్ బిల్లుకు మోదీ వ్య‌వ‌హార శైలికి ముడిపెట్టిన శివాజీ... మోదీ తలాక్ బిల్లును ప్ర‌తిపాదించారు. కుటుంబాన్ని - భార్య‌ను వ‌దిలివేస్తున్న మోదీ లాంటి వ్య‌క్తుల పీచ‌మ‌ణిచేందుకే తాను మోదీ త‌లాక్ పేరిట ప్ర‌త్యేక బిల్లును ప్ర‌తిపాదిస్తున్న‌ట్లుగా త‌న‌దైన శైలిలో చెప్పిన శివాజీ... నిజంగానే త‌న ప్ర‌సంగం ద్వారా అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఇస్లామిక్ చట్టాల‌ను ఆధారం చేసుకుని ముస్లిం మ‌హిళ‌ల‌కు అన్యాయం చేస్తున్న భ‌ర్త‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు మోదీ స‌ర్కారు త్రిపుల్ త‌లాక్ బిల్లును తీసుకొచ్చింద‌ని గుర్తు చేసిన శివాజీ... భార్య‌ను - కుటుంబాన్ని న‌డి సంద్రంలో వ‌దిలేసి వ‌చ్చిన మోదీ లాంటి వ్య‌క్తుల‌ను ఎలా క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా వ్య‌క్తుల‌ను దారికి తెచ్చేందుకు మోదీ త‌లాక్ పేరిట ప్ర‌త్యేక బిల్లును తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని కూడా శివాజీ పేర్కొన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటుగా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల‌ను అమ‌లు చేయాల్సిన మోదీ... అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని శివాజీ ఆరోపించారు.

అయినా మోదీ ఏపీ టూర్‌ లో తామంతా గోబ్యాక్ మోదీ అన్న‌ది... ఆయ‌న‌ను ఢిల్లీకి తిరిగి వెళ్ల‌మ‌ని చెప్ప‌డం కాద‌ని - త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ కు వెళ్ల‌మ‌ని చెప్ప‌డమేన‌ని కూడా శివాజీ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ బీజేపీలో ఓ న‌లుగురు నేత‌లు మాత్ర‌మే ఉన్నార‌ని, తాను కూడా ఏపీ వ్య‌క్తిన‌ని చెప్పుకున్న జీవీఎల్ న‌ర‌సింహారావు ఉత్త‌రాదికి చెందిన వ్య‌క్తేన‌ని కూడా శివాజీ తేల్చిపారేశారు. మొత్తంగా చంద్ర‌బాబు దీక్ష‌లో అంద‌రికంటే భిన్నంగా మోదీ త‌లాక్ బిల్లును ప్ర‌తిపాదించిన శివాజీ... అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడ‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు.